మళ్లీ మూడ్రోజులు దంచుడే.. గుండె పగిలే వార్త చెప్పిన వాతావరణశాఖ

Weather Report : హైదరాబాదీలకు మరోసారి గుండె పగిలే వార్త చెప్పింది వాతావరణశాఖ. ఇప్పటికే కుండపోత వానలు, వరదలతో అతలాకుతలమైన హైదరాబాదీలకు మరో వార్నింగ్ ఇచ్చింది ఐఎండీ

Update: 2020-10-19 16:13 GMT

Weather Report : హైదరాబాదీలకు మరోసారి గుండె పగిలే వార్త చెప్పింది వాతావరణశాఖ. ఇప్పటికే కుండపోత వానలు, వరదలతో అతలాకుతలమైన హైదరాబాదీలకు మరో వార్నింగ్ ఇచ్చింది ఐఎండీ. ఇప్పట్లో హైదరాబాద్‌ను వరుణుడు వదిలే పరిస్థితి కనిపించడం లేదని, మరో మూడ్రోజులు వానలు దంచికొడతాయని హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, క్లుములో నింబస్ మేఘాల కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

మరో మూడ్రోజులు వర్షాలు దంచికొడతాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా వరదలతో నానా అవస్థలు పడుతోన్న హైదరాబాదీలను అలర్ట్ చేస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో తిరుగుతోన్న జీహెచ్ఎంసీ సిబ్బంది మైకుల్లో అనౌన్స్ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచిస్తున్నారు. మరో మూడ్రోజులపాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించినందుకు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మైకుల్లో చెబుతున్నారు.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతోపాటు.... వచ్చే 24గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందన్న హెచ్చరికలతో... అత్యవసరమైతేనే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హైదరాబాదీలకు GHMC వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచిస్తున్నారు.

వాతావరణశాఖ, GHMC హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దని హైదరాబాదీలకు మంత్రి కేటీఆర్ సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలందరూ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. పునరావాస కేంద్రాల్లో సకల సదుపాయాలు కల్పించామన్న కేటీఆర్.... ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మరో మూడ్రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించినందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వందేళ్లకోసారి వచ్చే ఇలాంటి ఉత్పాతంలో ప్రాణనష్టం ఎక్కువగా జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు.

Tags:    

Similar News