Rajiv Yuva Vikasam: గుడ్ న్యూస్ వినిపించిన తెలంగాణ సర్కార్.. రూ. 50వేలలోపు రుణాలకు వందశాతం రాయితీ

Update: 2025-03-23 01:39 GMT

Rajiv Yuva Vikasam: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాజీవ్ యువ వికాసం స్కీము కింద స్వయం ఉపాధి రుణాల మంజూరు నిబంధనలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనిట్లను నాలుగు కేటగిరీలుగా విభజించి, రాయితీ నిధుల వాటాను పెంచింది. గతంలో అమలు చేసిన స్వయం ఉపాధి స్కీముల కన్నా మెరుగ్గా నిబంధనలు రూపొందించడంతోపాటు పకడ్బందీగా అమలు చేసేందుకు శనివారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, సంక్షేమశాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో యూనిట్ల వ్యయం, రాయితీ వాటాను ఖరారు చేసింది ప్రభుత్వం . రాజీవ్ యువవికాసం కింద ఆర్థికంగా వెనబడిన వర్గాలకు యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈబీసీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆదివారం నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. రాజీవ్ యువవికాసం స్కీముపై సమగ్ర నిబంధనలు సోమవారం జారీ కానున్నాయి.

స్వయం ఉపాధి పథకాల కింద చిరు వ్యాపారులు చేసేవారి కోసం ప్రత్యేకంగా రూ. 50వేల రుణ పథకాన్ని అమలు చేయనుంది. దీనికింద లబ్దిదారులకు 100 శాతం రాయితీతో రుణాలను మంజూరు చేయనుంది. అలాగే లక్షలోపు యూనిట్లకు గతంలో 80శాతం సబ్సిడీ ఉండేది . దాన్ని ఇప్పుడు 90శాతానికి పెంచాలని నిర్ణయించింది. అంటే లక్షలోపు యూనిట్ కోసం లబ్దిదారుడు కేవలం రూ. 10వేలు తన వాటా కింద చెల్లించాల్సి ఉంటుంది.

ఇక రూ. 1 నుంచి 2 లక్షల్లోపు వ్యయం కలిగిన యూనిట్లకు రాయితీని 80శాతానికి పెంచింది. రూ. 2-4లక్షల యూనిట్లకు రాయితీ 70శాతంగా నిర్ణయించింది. స్వయం ఉపాధి పథకాల కోసం ఎదురుచూస్తున్న వారికి మెరుగైన ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ మేరకు సబ్సిడీ వాటా పెంచినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News