రణరంగంగా ప్రగతిభవన్‌ ప్రాంగణం

Update: 2019-10-16 10:11 GMT

ప్రగతిభవన్‌ రణరంగంగా మారింది. టీఆర్‌టీ (టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌), పీఈటీ ఫలితాలు ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు అభ్యర్థులను అడ్డుకున్నారు. బలవంతంగా వారిని వ్యానులో ఎక్కించారు. ఈ క్రమంలో అభ్యర్థులు తీవ్రంగా ప్రతిఘటించారు. అయినా వారిని వదలకుండా పోలీసులు అక్కడి నుంచి తరలించారు.

సుమారు 400 మంది విద్యార్థులు విడతల వారీగా ప్రగతిభవన్‌ చేరుకుని ఆందోళన చేపట్టారు. ఓ సారి మహిళా అభ్యర్థులు, మరోసారి విజిల్‌ వేసుకుంటూ బ్యానర్లు పట్టుకుని మిగతా అభ్యర్థులు తరలివచ్చారు. రోడ్డుపైనే భైటాయించారు. దీంతో మహిళా అభ్యర్థులను లేడీ కానిస్టేబుళ్లు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఒకే వ్యానులో అందరినీ కుక్కారు. కొందరు మహిళలు తమ పిల్లలతోని రావడంతో వారు చాలా ఇబ్బందులు పడ్డారు. చిన్నారులను ప్రత్యేకంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు.

తమపై ఈ దౌర్జన్యం ఇంకెన్నాళ్లని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఏడేళ్ల నుంచి పోరాడితే రెండేళ్ల క్రితం 2017 లో 367 ఖాళీలతో పీఈటీ నోటిఫికేషన్‌ విడుదల చేశారని అయినా ఇప్పటివరకు ఫలితాలు ఎందుకు విడుదల చేయలేదని ఆవేశంతో ప్రశ్నిస్తున్నారు. తమపై ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ కక్ష కట్టిందని ఇప్పటికే తాము అలసిపోయామని కొందరు అభ్యర్థులు కన్నీరు పెట్టుకున్నారు. గురుకుల పోస్టుల్లోనూ తమకు అన్యాయం జరిగినట్లు ఆవేదనతో చెప్పుకొచ్చారు.

మరో అభ్యర్థి అయితే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో వ్యాన్ నుంచి కిందికి దూకాడు. దీంతో అతడికి స్వల్ప గాయాలయ్యాయి. బతకలేక, చావలేక ఉన్నామని.. తమకేమైనా జరిగితే అది కేసీఆర్‌ ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీదే బాధ్యత అని అన్నారు. 

Tags:    

Similar News