Telangana: తెలంగాణలో ఓటింగ్ పెంచేందుకు ఈసీ ఫోకస్

Telangana: 26 అసెంబ్లీ సెగ్మంటులను గుర్తించిన ఈసీ

Update: 2024-05-06 05:34 GMT

Telangana: తెలంగాణలో ఓటింగ్ పెంచేందుకు ఈసీ ఫోకస్

Telangana: తెలంగాణలో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న నియోజక వర్గాలపై దృష్టి సారించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీచేసింది. తొలి రెండు దశల్లోనూ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడంపై ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. మిగతా దశలో ఓటింగ్ పెరిగేలా ప్రత్యేక ప్రణాళికను అమలు చేయాలని సూచించింది. 2018 నుంచి జరిగిన మూడు ఎన్నికల్లో రాష్ట్రంలోని 26 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. హైదారాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గాల్లో 2014 సార్వత్రిక ఎన్నికల్లో సగటు పోలింగ్ శాతం 54.48గా నమోదైంది. 2019లో సగటున 48.56శాతం మాత్రమే జరిగింది. మిగిలిన 13 లోక్ సభ నియోజక వర్గాల సగటు 65 శాతం వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

పోలింగ్ తక్కువగా నమోదైన 26 అసెంబ్లీ నియోజక వర్గాల్లో సింహభాగం నగర, పట్టణ ప్రాంతాల్లోనివే కావడం విశేషం. ఆయా చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఎండవేడిని తట్టుకునేలా సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వరుసలో ఎంతమంది ఉన్నారు.. పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుంది అన్న విషయాలు తెలుసుకునేందుకు రూపొందించిన క్యూ యాప్ పై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులని ఆదేశించినట్లు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ శాతం బాగా తక్కువగా నమోదవుతున్న నియోజక వర్గాలు వరుసగా.. చార్మినార్, మలక్ పేట, గోషా మహల్, కార్వాన్, చాంద్రాయణ గుట్ట యాకూత్ పుర, బహుదూర్ పుర, సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్ పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేర్ లింగం పల్లి, కరీంనగర్, నిజామాబాద్ అర్బన్, మేడ్చల్... ఈ నియోజక వర్గాలపై ఈసీ ఫోకస్ పెంచింది.. ఓటింగ్ పెంచేందుకు భారీగా కసరత్తు చేస్తుంది.. దీనికి ఓటర్లు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాలి. 

Tags:    

Similar News