Indiramma Indlu Scheme : భూదాన్ బాధితులకు బంపర్ ఆఫర్.. ఉచితంగా ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు: మంత్రి పొంగులేటి
భూదాన్ బాధితులకు బంపర్ ఆఫర్.. ఉచితంగా ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు: మంత్రి పొంగులేటి
Indiramma Indlu Scheme : తెలంగాణలో ఇళ్లు లేని పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సంచలన ప్రకటన చేశారు. ఖమ్మం కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా వెలుగుమట్ల ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన అర్హులైన పేదలకు ఉచితంగా ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి, ఈ నెల 15వ తేదీలోపు అర్హులకు ఇళ్ల కేటాయింపు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి పొంగులేటి తీవ్రంగా ఖండించారు. ఇళ్లు కోల్పోయిన వారిలో నిజమైన పేదలెవరో గుర్తించేందుకు సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గత ఎనిమిదేళ్లుగా అక్కడ ఉంటున్న 720 కుటుంబాల వివరాలను పరిశీలిస్తున్నామని, ఆ సర్వేలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తేలిందని వివరించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నివాసయోగ్యమైన స్థలం కేటాయించి, అక్కడ అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు వంటి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని, నిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన హితవు పలికారు.
ఇక హైదరాబాద్ నగరంలోని పేదల కోసం ప్రభుత్వం ఉగాది పండుగను ముహూర్తంగా ఫిక్స్ చేసింది. నగరంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని మంత్రి తెలిపారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిజమైన నిరుపేదలను ఎంపిక చేశామన్నారు. సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు, స్థలం లేని వారి కోసం ప్రత్యేక భవన సముదాయాలను (అపార్ట్‌మెంట్ తరహాలో) నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్థలాల సేకరణ కూడా పూర్తయిందని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లను నిర్మించి, పేదల దీవెనలు పొందడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి పునరుద్ఘాటించారు. ప్రజా పాలనలో భాగంగా వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, రాజకీయాలకు అతీతంగా అర్హులకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈ ఉగాది నాటికి వేలాది మంది పేదలకు సొంతింటి పట్టాలు అందజేయడం ద్వారా ప్రభుత్వం ఒక చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టబోతోంది.