E-car race case: సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సస్పెన్షన్!

E-car race case: హైదరాబాద్ ఈ-కార్ ఫార్ములా రేస్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పూర్తి వివరాలు ఇవే

Update: 2026-02-28 05:45 GMT

E-car race case

E-car race case: ఈ -కార్ ఫార్ములా రేస్ కేసులో సంచలనం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ ఈవెంట్ నిర్వహణలో జరిగిన అవకతవకల కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై తెలంగాణ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత ఫైలుపై సంతకం చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఆయనను ఏ2 (A2) నిందితుడిగా పేర్కొంటూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

గతంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ (MAUD) ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో, అరవింద్ కుమార్ ఈ-కార్ రేస్ వ్యవహారాలను పర్యవేక్షించారు. ఈ ప్రాజెక్టులో ఆర్థిక పరమైన నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించింది ప్రభుత్వం.

E-car race case: ఈ కేసులో కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT) ఇటీవల అరవింద్ కుమార్‌ను విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిని మంజూరు చేసింది. ఈ పరిణామం ఆయన సస్పెన్షన్‌కు దారితీసింది. ఈ-కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కె. తారకరామారావును ఏ1 (A1)గా, అరవింద్ కుమార్‌ను ఏ2గా అధికారులు చేర్చారు.

ప్రస్తుతం డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అరవింద్ కుమార్‌కు, ఇటీవలే చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల ప్రక్రియలో ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అప్పటి నుంచే ఆయన సస్పెన్షన్‌పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవడంతో ఇది ఖరారైంది.

ప్రభుత్వం నుంచి త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తిస్థాయి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ రేస్(E-car race case) నిర్వహణలో నిధుల దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాలు జరిగాయని ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో మరిన్ని వివరాలు దర్యాప్తు ముగిసేకొద్దీ వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈ పరిణామం రాష్ట్ర అధికార యంత్రాంగంలో పెను సంచలనం సృష్టించింది. దర్యాప్తు ఏ దిశగా సాగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News