Weather Update : వర్షం తగ్గగానే ఉక్కపోత.. భానుడి భగభగలకు సిద్ధంగా ఉండమంటున్న వాతావరణ శాఖ
వర్షం తగ్గగానే ఉక్కపోత.. భానుడి భగభగలకు సిద్ధంగా ఉండమంటున్న వాతావరణ శాఖ
Weather Update : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత మూడు రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దక్షిణ కర్ణాటక నుంచి మహారాష్ట్ర వరకు విస్తరించి ఉన్న ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. ముఖ్యంగా శుక్రవారం సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు. రాజధాని హైదరాబాద్‌లో కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షపాత వివరాలు పరిశీలిస్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అత్యధికంగా 4.36 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరులో 1.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, భూపాలపల్లి వంటి జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు పడ్డాయి. అయితే, ఈ అకాల వర్షం అన్నదాతల పాలిట శాపంగా మారింది. కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న, శనగ, జొన్న పంటలు నేలవాలడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆరబోసిన పసుపు కుప్పలు తడిసిపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతానికి వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ, ఈ ఉపశమనం ఎంతో కాలం ఉండదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. శనివారం నుంచి వర్షాలు తగ్గి, వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంటుంది. అయితే అదే సమయంలో ఉక్కపోత మొదలవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలుగా ఉండగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల వద్ద కొనసాగుతున్నాయి. అల్పపీడన ప్రభావం తగ్గగానే ఎండల తీవ్రత పెరగనుంది.
మార్చి 1 నుంచి ఎండలు మండిపోతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భానుడి భగభగలు మొదలవనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మధ్యాహ్నం వేళ బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొన్నారు. అకాల వర్షాలు పోయి అగ్నిగుండం లాంటి ఎండలు రాబోతున్నాయని, దీనికి తగ్గట్లుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు.