Weather Update : గందరగోళంలో ఏపీ, తెలంగాణ వాతావరణం.. అసలు ఏం జరుగుతోంది?
గందరగోళంలో ఏపీ, తెలంగాణ వాతావరణం.. అసలు ఏం జరుగుతోంది?
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చిత్ర విచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే, మరోవైపు చల్లని గాలులు, అకాల వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి చివరి వారంలో ఎండలు ముదురుతాయి, కానీ ఈసారి ఉత్తరాది నుంచి వస్తున్న చలిగాలులు, ఏర్పడిన ద్రోణి కారణంగా ఏపీ, తెలంగాణలో వాతావరణం గందరగోళంగా మారింది. దీనివల్ల ఇవాళ రెండు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ వాతావరణ పరిస్థితులను గమనిస్తే.. ఉదయం వేళ ఆకాశం మేఘావృతమై చల్లగా అనిపించినా, సూర్యుడు రాగానే మేఘాలు మాయమై ఎండ దంచేస్తోంది. అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం సడెన్‌గా మారిపోతోంది. వాన పడుతుందన్నట్లుగా కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి కానీ, చాలా తక్కువ ప్రాంతాల్లోనే జల్లులు కురుస్తున్నాయి. ఈ మేఘాల వల్ల రాత్రివేళ గాలి ఆడక ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 30 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. ఇక్కడ ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతోంది. మధ్యాహ్నం వరకు చెమటలు పట్టించే ఎండ ఉన్నా, సాయంత్రం 4 గంటల తర్వాత ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కోస్తా తీరం, దక్షిణ రాయలసీమలో అక్కడక్కడా చినుకులు పడవచ్చు. ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా ఉంది. ముఖ్యంగా అర్థరాత్రి తర్వాత తేమ శాతం 93 శాతానికి చేరుతుండటంతో తెల్లవారుజామున భారీగా మంచు కురుస్తోంది. ఇటు బంగాళాఖాతం, అటు అరేబియా సముద్రాల్లో ఏర్పడిన ఆవర్తనాలు గాలులను అన్ని దిక్కులకు తిప్పుతుండటంతో ఈ గందరగోళం నెలకొంది.
అంతర్జాతీయంగా చూస్తే హిందూ మహాసముద్రంలో హొరాసియో అనే తీవ్ర తుపాను కల్లోలం సృష్టిస్తోంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈ గాలులు అంటార్కిటికా మంచును వేగంగా కరిగిస్తున్నాయి. దీని ప్రభావం వల్ల వచ్చే నెలలో ఆగ్నేయ ఆసియా దేశాల్లో భారీ మార్పులు రానున్నాయి. మన దేశంలో ఎండలు పెరిగే సూచనలు ఉన్నప్పటికీ, అప్పుడప్పుడూ అకాల వర్షాలు కురుస్తూనే ఉంటాయని అంచనా. ఈ అకాల వర్షాల వల్ల ఇప్పటికే పంట నష్టపోయిన రైతులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం కూడా రైతులకు భరోసా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.