హైదరాబాద్ ప్రజలకు కరోనా నుంచి ఎప్పుడు ఉపశమనం కలుగుతుందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి : విజయశాంతి

Update: 2020-05-15 05:01 GMT

తెలంగాణలో కరోనా కేసులు పెరగడంపై సినీనటి కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ తీసుకుంటున్న నియంత్రణ చర్యలపై అనుమానాలు వ్యక్తం చేశారు.

విజయశాంతి ఫేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్ట్ యధాతదం గా..

టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సూచనల మేరకు దాదాపు రెండు నెలల నుంచి ఇళ్లకే పరిమితమవుతున్న గ్రేటర్ హైదరాబాద్ వాసులకు కరోనా మహమ్మారి నుంచి ఎప్పుడు ఉపశమనం కలుగుతుందో అంతుబట్టడం లేదు. మే నెల ఎనిమిదో తేదీ తర్వాత తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోతాయని టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రకటనలు చూసి హైదరాబాద్ వాసులు చాలా ఆశలు పెంచుకున్నారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన తేదీ దాటిన తర్వాత వారం రోజులు గడిచాక కూడా కరోనా కేసులు తగ్గకపోగా... మళ్లీ ఈ మహామారి ఇంకా విజృంభిస్తోంది. హైదరాబాద్ వాసుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ సోకకుండా నియంత్రించేందుకు హైదరాబాద్‌ను టిఆర్ఎస్ ప్రభుత్వం రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఈ మహానగరంలో ఆంక్షలను చూస్తున్నప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లే వెసులుబాటు కూడా లేదు. మరి అలాంటప్పుడు మళ్లీ కేసుల సంఖ్య పెరగడానికి కారణం ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు.

విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ సమయం పూర్తయిందని ప్రభుత్వం ప్రకటించింది. మరి తబ్లిక్ జమాత్‌కు వెళ్ళిన వారందరినీ ప్రభుత్వం గుర్తించిందా? వారందరికీ క్వారంటైన్ పూర్తయిందని టిఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వగలదా? ప్రస్తుతం వలస కూలీల వల్ల కరోనా వ్యాపిస్తోందని టిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చింది. అదే నిజమైతే హైదరాబాద్‌ను రెడ్ జోన్‌గా ప్రకటించడంలో అర్థమేముంది? అంటే వలస కూలీలు హైదరాబాదులో విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఉందా? ఈ విషయంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వలస కూలీల వల్ల హైదరాబాదులో కరోనా వ్యాప్తి చెందకపోతే.. ఎవరి కారణంగా గత నాలుగు రోజుల పాటు కరోనా కేసులు పెరుగుతున్నాయో స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మొదటి నుంచీ అయోమయ ప్రకటనలతో, అస్పష్ట నిర్ణయాలతో... కరోనా కట్టడి విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వివాదాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఈ వైఖరిలో మార్పు రావాలని తెలంగాణ సమాజం కోరుకుంటోంది.



 



Tags:    

Similar News