Hyderabad Fire Accident: సిటీలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
Fire Accident in Hyderabad: ఈ అగ్ని ప్రమాదంలోనే మూడు గ్యాస్ సిలిండర్లు కూడా పేలడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువైంది.
Hyderabad Fire Accident: సిటీలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
Fire Accident in Hyderabad: రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలోని ఓ రెండంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో చెలరేగిన మంటలు పై అంతస్తుకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పై అంతస్తులో ఉంటున్న వారిలో ముగ్గురు మృతి చెందారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న లంగర్ హౌజ్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు.
కింది అంతస్తులో ఓవైపు మంటలు ఆర్పుతూనే మరోవైపు పై అంతస్తులో ఉన్న వారిని ల్యాడర్ ద్వారా కాపాడే ప్రయత్నం చేసినట్లు ఫైర్ బ్రిగేడియర్స్ తెలిపారు. పై అంతస్తులో చిక్కుకున్న ఐదుగురిని కాపాడి అంబులెన్సులో ఆస్పత్రికి తరలించాం. అప్పటికే అందులో ముగ్గురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయి ఉన్నారు. వారిలో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
చనిపోయిన వారిని ఏడేళ్ల చిన్నారి సిజిరా, 40 ఏళ్ల మహిళ సహానా, 70 ఏళ్ల వృద్ధురాలు జమీలాగా నార్సింగి పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది మరో ఐదుగురిని ప్రాణాలతో రక్షించినట్లు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలోనే మూడు గ్యాస్ సిలిండర్లు కూడా పేలడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువైంది. అగ్నిమాపక శాఖ అధికారులు అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది ఇంకా తెలియలేదు. నార్సింగి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.