ఇవాళ్టి నుంచి టి.కాంగ్రెస్ రెండో విడత బస్సుయాత్ర
Congress Bus Yatra: తొలిరోజు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో బస్సు యాత్ర
ఇవాళ్టి నుంచి టి.కాంగ్రెస్ రెండో విడత బస్సుయాత్ర
Congress Bus Yatra: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రెండోవిడత బస్సుయాత్ర షెడ్యూల్ ప్రకటించింది. నేటి నుంచి ఆరు రోజులపాటు నవంబర్ 2 వరకు కొనసాగేలా రూట్‌మ్యాప్ తయారుచేశారు. రోజుకు మూడు చొప్పున రెండోవిడత బస్సు యాత్ర జరగనుంది. తొలిరోజు యాత్రలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ పాల్గొననున్నారు.
మధ్యాహ్నం తాండూరు కార్నర్ మీటింగ్‌కు డీకే శివకుమార్ హాజరుకానున్నారు. పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల ప్రచారాల్లోనూ పాల్గొంటారు. రెండోరోజున సంగారెడ్డి, నర్సాపూర్‌లలో కార్నర్ మీటింగ్‌లు, మెదక్‌లో పాదయాత్రకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ప్రియాంకాగాంధీ పర్యటన ఉంటుందని గాందీభవన్ వర్గాలు చెబుతున్నా 31వ తేదీ మాత్రమే ఇప్పటి వరకు ఖరారైంది.
నాగార్జునసాగర్, కొల్లాపూర్ మీటింగ్‌లలో ప్రియాంక పాల్గొననున్నారు. వచ్చే నెల 1, 2 తేదీల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా పాల్గొంటారని చెబుతున్నా ఆయన పర్యటన ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఒకవేళ రాహుల్ పర్యటన ఖరారైతే ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో జరిగే బస్సుయాత్రలో ఆయన పాల్గొనే అవకాశాలున్నాయి.