డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనం సీజ్, రూ.10 వేల ఫైన్, జైలు శిక్ష తప్పదు: సీపీ సజ్జనార్ హెచ్చరిక

క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను పర్యవేక్షించారు.

Update: 2025-12-25 08:10 GMT

హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌పై ఉక్కుపాదం మోస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను పర్యవేక్షించారు.

బంజారాహిల్స్‌లోని టీజీ స్టడీ సర్కిల్ పరిసరాల్లో నిర్వహించిన తనిఖీల్లో పాల్గొన్న సీపీ, పోలీస్ సిబ్బంది పనితీరును పరిశీలించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారితో స్వయంగా మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చారు.

డ్రంకెన్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాలపై వాహనదారులకు సజ్జనార్ అవగాహన కల్పించారు. “నిత్యం మీడియాలో చెబుతున్నా, చదువుకున్న వారు కూడా ఇలా మద్యం తాగి డ్రైవ్ చేస్తే ఎలా?” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగించే అవకాశం ఉందని హెచ్చరించారు.

పబ్‌లు, పార్టీలకు వెళ్లేవారు తప్పనిసరిగా డ్రైవర్లను వెంట తీసుకురావాలని లేదా క్యాబ్‌లు బుక్ చేసుకోవాలని సూచించారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించవద్దని కోరారు.

డిసెంబర్ 31 రాత్రి వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు. నగరవ్యాప్తంగా సుమారు 120 ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడతామని వెల్లడించారు.

డ్రంకెన్ డ్రైవ్‌పై ఎలాంటి ఉపేక్ష ఉండదని సజ్జనార్ స్పష్టం చేశారు. పట్టుబడితే వాహనం సీజ్ చేయడమే కాకుండా రూ.10 వేల జరిమానా విధిస్తామని తెలిపారు. అవసరమైతే 6 నెలల జైలు శిక్ష కూడా విధిస్తామని హెచ్చరించారు. మద్యం మోతాదును బట్టి శాశ్వతంగా లైసెన్స్ రద్దుకు కూడా రవాణా శాఖకు సిఫారసు చేస్తామని పేర్కొన్నారు.

Tags:    

Similar News