Shravana Shukravaram : సీఎం కేసీఆర్ దూకుడు.. వారం రోజుల్లోపే తొలి జాబితా..?

CM KCR: సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కొన్నిచోట్ల వెల్లువెత్తుతున్న అసంతృప్తి వర్గ పోరు

Update: 2023-08-17 06:38 GMT

CM KCR: సీఎం కేసీఆర్ దూకుడు.. వారం రోజుల్లోపే తొలి జాబితా విడుదలంటూ ప్రచారం

CM KCR: ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ బాస్ దూకుడు పెంచారు. బీఆర్ఎస్‌ తొలి జాబితాపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. నేటి నుంచి నిజ శ్రావణమాసం కావడంతో.. మంచి ముహూర్తాలపై అభ్యర్థులు ఆశలు పెంచుకుంటున్నారు. వారం రోజులలోపే తొలి జాబితా విడుదలంటూ ప్రచారం మొదలయ్యింది. గత ఎన్నికల్లో శుక్రవారం రోజు అభ్యర్థులను ప్రకటించడంతో.. శ్రావణ శుక్రవారం సెంటిమెంట్ అంటున్నారు నేతలు. మరోవైపు ఈనెల 21న శ్రావణ సోమవారం రోజు.. తొలి జాబితా విడుదలవుతుందంటూ బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సోమవారం పంచమి తిథి మంచి రోజు అంటూ ప్రచారం సాగుతోంది.

ఇక ఇప్పటికే మంత్రి కేటీఆర్, హరీశ్ రావు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా రిపోర్టు తీసుకుని అభ్యర్థుల లిస్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. విభేదాలు లేని నియోజకవర్గాల్లో ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశాలున్నాయి. ఇందులో ఇప్పటికే 80 నుంచి 85 మంది జాబితాను.. గులాబీ బాస్ సిద్ధం చేశారంటున్నారు సీనియర్ నేతలు. ఒకేసారి వందమందితో కూడిన జాబితాను ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది.

ఇక త్వరలోనే అభ్యర్థుల జాబితా రానుండటంతో నియోజకవర్గాల్లోని ఆశావహుల్లో పోటీ పెరుగుతోంది. టికెట్ల కోసం ఇప్పటికే కీలక నేతలతో లాబీయింగ్‌ కూడా ప్రారంభించారు ఆశావహులు. దీంతో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆయా నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్‌ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే అభ్యర్థుల జాబితా ప్రకటనతో ఎక్కడా విభేదాలు రాకూడదనే ఆలోచనతో బీఆర్ఎస్‌ అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. అందరినీ కలుపుకొని పోయే నేతలనే అభ్యర్థులుగా ప్రకటించాలనే ఆలోచనలో ఉంది.

మరోవైపు కొన్ని స్థానాల్లో అసంతృప్త సెగలు రగులుతున్నాయి. నియోజకవర్గాల్లోని కొందరు నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. దీంతో అసంతృప్తులను బుజ్జగించేందుకు చర్యలు తీసుకుంటోంది పార్టీ అధిష్టానం. ఎట్టి పరిస్థితుల్లో వంద సీట్లు గెలిచి మూడోసారి విజయదుందుభి మోగించాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది.

Tags:    

Similar News