వ్యవసాయ సీజన్ మొదలైనా నైరాశ్యంలో రైతన్న

Khammam District: ముడిసరుకుల ధరలు పెరగడంతో పెరిగిన పెట్టుబడి వ్యయం

Update: 2022-06-29 02:08 GMT

వ్యవసాయ సీజన్ మొదలైనా నైరాశ్యంలో రైతన్న

Khammam District: వానాకాలం మొదలైంది. వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ఉత్సాహంగా పనులు మొదలుపెట్టిన రైతులకు మాత్రం పెరిగిన ముడిసరుకుల ధరలు నిరాశపరుస్తున్నాయి. పెరిగిన ధరలతో ఖమ్మం జిల్లా రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మార్కెట్‌లో ముడిసరకుల ధరలు పెరుగుతుండటంతో పంట పెట్టుబడి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరగడంతో ట్రాక్టర్లకు, కూలీలకు అన్నింటికీ డిమాండ్ ఏర్పడింది. దీనికితోడు పెట్రోల్, డీజిల్, విత్తనాల ధరలు పెరగిన కారణంగా పెట్టుబడులు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి వరి పంటకు పెట్టుబడులు డబుల్ అయ్యాయని రైతులు చెబుతున్నారు.

పెరిగిన ధరలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే వరి నాట్లేసే సమయంలోనే ఖర్చులు ఊహించకుండా పెరుగుతున్నాయి. అలాంటప్పుడు పంటలు పూర్తయ్యేసరికి ఖర్చు ఇంకా ఎంత అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నా మద్దుతు ధర మాత్రం పెరగడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా రిజర్వాయర్లలో, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతో వాటి ఆయకట్టు కింద ఈ ఏడాది వరిసాగు గణనీయంగా పెరిగింది. అధికారుల అంచనా ప్రకారం గతంలో సాగులో లేని భూములు కూడా ఈసారి సాగులోకి వచ్చాయి. దీంతో గ్రామాల్లో ట్రాక్టర్లకు, వ్యవసాయ కూలీలకు డిమాండ్ బాగా పెరిగింది. వీటికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగడంతో వరి పొలం దున్నేందుకు ట్రాక్టర్ యజమానులు ధరలు పెంచారు. ఇక పంట పెట్టుబడులను తగ్గించే ఆధునిక పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు.

రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించాల్సిన వారు.. ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో రైతులు పాత పద్ధతులే పాటిస్తూ వ్యవసాయంలో నష్టాలు చవిచూస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే సాగు పద్ధతులపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News