Bodhan: బోధన్‌లో ఉగ్ర కలకలం.. అనుమానితుడి అరెస్ట్‌

Bodhan: నిజామాబాద్ జిల్లాలో మరోసారి ఉగ్రకదలికలు కలకలం రేపుతున్నాయి.

Update: 2025-09-11 06:16 GMT

Bodhan: బోధన్‌లో ఉగ్ర కలకలం.. అనుమానితుడి అరెస్ట్‌

Bodhan: నిజామాబాద్ జిల్లాలో మరోసారి ఉగ్రకదలికలు కలకలం రేపుతున్నాయి. బోధన్ కేంద్రంగా కదలికలు బయట పడటంతో జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఆచన్‌పల్లికి చెందిన యమాన్ అనే యువకున్ని NIA అరెస్ట్ చేసింది. అతని వద్ద ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు ఎన్‌ఐఏ అదికారులు. కోర్టులో హాజరుపరిచి అతన్ని విచారణ కోసం ఢిల్లీకి తీసుకెళ్లినట్లు సమాచారం. యమాన్‌కు సోషల్ మీడియా ద్వారా ఉగ్ర సంస్థలతో పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది.

ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా కేంద్ర నిఘా సంస్థలు, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో డానిష్‌ను జార్ఖండ్‌లోని రాంచీలో అరెస్ట్ చేశాయి. దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి. ఢిల్లీలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు ఎన్‌ఐఏ అధికారులు. ఇదే సమయంలో రాష్ట్రంలోని బోధన్ పట్టణంలో కూడా ఎన్‌ఐఎ బృందాలు జల్లెడ పట్టాయి. ఉగ్ర మూలాలు కలిగిన వ్యక్తిని అరెస్టు చేశాయి. అతని వద్ద ఐసిస్‌ కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టడంతో పాటు ఓ ఎయిర్ పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయమై స్థానిక పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా దీనిని అధికారికంగా వెల్లడించలేదు.

బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు ఇక్కడి నుంచే పాస్‌పోర్టులు జారీ అయిన ఉదంతం అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీయగా తాజాగా ఐసిస్‌తో సంబంధాలున్న వ్యక్తి పట్టుబడడం జిల్లాలో చర్చనీయాంగా మారింది. అయితే యమాన్ కుటుంబసభ్యులు మాత్రం అతనికి ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్నారు. కేవలం సోషల్‌మీడియా పరిచయం మాత్రమే ఉందని అప్పుడప్పుడూ ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటారని చెప్పారు. అంతేతప్ప ఉగ్రవాదానికి సంబంధించి ఎప్పుడూ వారితో మాట్లాడలేదని చెబుతున్నారు.

Tags:    

Similar News