Telangana Municipal Elections 2026: తెలంగాణలో ముగిసిన మున్సిపల్ పోలింగ్.. బాక్సుల్లో అభ్యర్థుల జాతకం.. శుక్రవారమే ఫలితాలు!

Telangana Municipal Elections 2026: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది.

Update: 2026-02-11 11:57 GMT

Telangana Municipal Elections 2026: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.

మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 62.09 శాతం మేర పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ఓటర్లు ఓటింగ్ పట్ల కాస్త మిశ్రమ స్పందన చూపారు. ఒకటి రెండు చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు, వాగ్వాదాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రత మధ్య ఓటింగ్ నిర్వహించింది.

ఈ నెల 13వ తేదీ (శుక్రవారం) ఉదయం 8 గంటల నుంచి 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అదే రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం కల్లా పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

గెలిచిన వార్డు సభ్యులు, కార్పొరేటర్లతో ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది.

రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మరియు బిజెపి పార్టీలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ఈ పోలింగ్‌తో అభ్యర్థుల భాగ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది.

Tags:    

Similar News