కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత.. బండి సంజయ్‌ను హైదరాబాద్‌కు తరలించిన పోలీసులు

Kamareddy: పోలీస్‌ వాహనానికి అడ్డుపడిన రైతులు, బీజేపీ శ్రేణులు

Update: 2023-01-07 01:17 GMT

కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత.. బండి సంజయ్‌ను హైదరాబాద్‌కు తరలించిన పోలీసులు

Kamareddy: కామారెడ్డిలో రైతు సంఘాల JAC తలపెట్టిన బంద్ ఉద్రిక్తతల మధ్య ముగిసింది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దుచేయాలన్న డిమాండ్‌ను రైతు JAC గట్టిగా వినిపించింది. రైతు సంఘాల పిలుపుతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కామారెడ్డిలో పోలీస్ 30 యాక్ట్ అమలు చేసి అడుగడుగునా బందోబస్తు ఏర్పాటు చేశారు. కామారెడ్డి వీధుల్లోకి వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైతు సంఘాల జెఎసి బంద్ కు మద్ధతుగా వచ్చిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు. బీజేపీ కార్యకర్తలు తలపెట్టిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

అనంతరం కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టరేట్ ముట్టడికి బీజేపీ శ్రేణులు యత్నించాయి. ఈ ఆందోళనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొన్నారు. బారికేడ్లు తొలగించి కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో బండి సంజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తరలిస్తుండగా.. బీజేపీ శ్రేణులు పోలీసు వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి బండి సంజయ్‌ను హైదరాబాద్‌కు తరలించారు.

అంతకుముందు బంద్‌కు మద్ధతిచ్చేందుకు వచ్చిన మాజీ మంత్రి షబ్బీర్ అలీని, కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత షబ్బీర్ అలీ, రైతు సంఘాల ప్రతినిధులతో కలిసి కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ను కలిసి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దుచేయాలని వినతిపత్రం అందించారు. 

Tags:    

Similar News