కేకే మంత్రాంగం ఫలించేనా..?

Update: 2019-10-15 04:57 GMT

ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపించడంతో ఒక మెట్టు దిగడమే మంచిదని భావించిన తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీలో సీనియర్ నేత కేశవరావుని రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. కార్మికులు ప్రభుత్వంతో చర్చలకు రావాలని, తమ వాదనను కూడా ఒకసారి వినిపించుకోవాలని కోరడంతో స్పందించిన ఆర్టీసీ జేఏసీ తాము చర్చలకు సిద్ధమని, ప్రభుత్వానికి, కార్మికులకు మధ్యవర్తిగా కేకే ఉండాలని తేల్చిచెప్పింది. దీంతో సీఎం ఆదేశాలతో హుటాహుటీన హైదరాబాద్‌ చేరుకున్నారు కేకే.

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చుతుండటంతో ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు కార్మికులతో చర్చలు జరపకుండా కేవలం ప్రత్యామ్నాయాలపైనే ఫోకస్ పెట్టిన సర్కార్ కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. పరిస్థితి మరింతగా చేయి దాటితే ఆ తర్వాత పరిణామాలు మారిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆర్టీసీ కార్మికులతో చర్చల కోసం సీఎం కేసీఆర్ వ్యూహాత్మంగా టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ కే.కేశవరావును రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.

సోమవారం కేకే పత్రికా ప్రకటన విడుదల చేయడం ఆ తరువాత దీనిపై కార్మిక సంఘాల కీలక నేత అశ్వత్ధామ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో చర్చలపై కొత్త ఆశలు చిగురించాయి. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం శుభపరిణామనేని అశ్వత్థామరెడ్డి చెప్పారు. కేసీఆర్ తర్వాత వ్యూహాత్మకంగా సమస్యలను పరిష్కరించే దిట్టగా పేరున్న కే.కేశవరావు సమ్మెను విరమింపజేసే విషయంలో కార్మికులను ఒప్పిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి గట్టిగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఢిల్లీలో ఉన్న కేకే హుటాహుటిన రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. వచ్చీ రావడమే ఆర్టీసీ కార్మిక సంఘాలు చర్చలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

అయితే, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా మిగతా అన్ని అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలుస్తోంది. ఈ అంశాలతోనే కేకే కార్మిక సంఘాలను ఒప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ నేత కేశవరావు తీవ్రతరంగా మారుతున్న ఆర్టీసీ సమ్మెను కూడా తనదైన నేర్పుతో పరిష్కరిస్తారేమో చూడాలి.

Tags:    

Similar News