ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు నో అబ్జెక్షన్: తెలంగాణా ప్రభుత్వం
కరోనా విలయంలో మూసివేసిన సరిహద్దులను తెరిచేందుకు తెలంగాణా ప్రభుత్వం ముందుకొచ్చింది.
కరోనా విలయంలో మూసివేసిన సరిహద్దులను తెరిచేందుకు తెలంగాణా ప్రభుత్వం ముందుకొచ్చింది. అన్ లాక్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వెలుసుబాటు కల్పించింది. ఇక్కణ్నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ఎటువంటి అనుమతులు అవసరం లేదని పేర్కొంది. సరిహద్దులో ఎటువంటి చెకింగ్ లు ఉండవంటూ చెప్పుకొచ్చింది.
అన్‌లాక్-1.0 ప్రస్తుతం భారత్‌లో అమల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి సడలింపులను మరింతగా పెంచిన తరువాత, వివిధ రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల వద్ద గతంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వస్తున్న వాహనాలకు ప్రస్తుతం అధికారులు ఎటువంటి ఆటంకాలనూ కలిగించడం లేదు. ఇదే సమయంలో తమ వారిని చూసేందుకు, అత్యవసర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు వెళ్లడానికి బయలుదేరుతున్న తెలంగాణ వాసులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.
ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు నెమ్మది నెమ్మదిగా కోవిడ్ బారిన పడుతుండటం కలవరం కలిగిస్తోంది. ఉస్మానియా, పేట్ల బురుజు ప్రసూతి హాస్పిటల్, నిమ్స్ ఇలా డాక్టర్లందరికీ పాజిటివ్ వస్తుండటంతో వైద్యులను కాపాడుకోడానికి యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలోకి ముందస్తు అనుమతులు లేకుండా ఎవరూ రావద్దని చెబుతోంది. వలస కార్మికులు స్పందన ద్వారా రిజిస్టర్ చేసుకుని రావాలని చెబుతోంది. రాశ్రంలోకి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని క్వారంటైన్ కు పంపిస్తామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.