Bandi Sanjay: వికసిత భారత్ లక్ష్యంగా పేపర్‌లెస్ జనగణన.. బండి సంజయ్ కీలక సూచనలు

Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఢిల్లీలో తన నివాసం నుంచి డిజిటల్ విధానంలో జనగణన వివరాలను నమోదు చేసుకున్నారు.

Update: 2026-04-08 14:31 GMT

Bandi Sanjay: వికసిత భారత్ లక్ష్యంగా పేపర్‌లెస్ జనగణన.. బండి సంజయ్ కీలక సూచనలు

Bandi Sanjay: జనగణన అధికారుల ప్రమేయం లేకుండానే ఇంట్లో నుండే డిజిటల్ విధానంలో సొంతంగా ప్రతి ఒక్కరూ జనగణన వివరాలను నమోదు చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఈనెలలో ప్రారంభమైన జనగణనలో భాగంగా తొలిదశలో హౌజ్ లిస్టింగ్ (ఇంటి వివరాలు), హౌజింగ్ సెన్సెస్ (ఇంట్లోని సౌకర్యాల) వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. అందు కోసం https://se.census.gov.in వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు.

ఈరోజు జాతీయ రిజిస్ట్రార్ జనరల్, జనాభా గణాంకాల కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్, జాయింట్ డైరెక్టర్ దీరజ్ జైన్ తోపాటు ఆ విభాగానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసానికి విచ్చేశారు. జనగణనలో భాగంగా తొలిదశలో చేపడుతున్న హౌజ్ లిస్ట్, హౌజింగ్ సెన్సెస్ వివరాలను వివరించారు. తొలిదశలో లోకేషన్ డిటైల్స్, ఒక కుటుంబం ఉండే ఇల్లు, ఆఫీస్, సౌకర్యాల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనుండే స్వీయ ఎన్యుమరేషన్ ను నమోదు చేసుకునేందుకు వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ డిజిటల్ విధానంలో సొంతంగా తన ఇల్లు, ఇంట్లోని సౌకర్యాల వివరాలను నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో డిజిటల్ విధానంలో జనగణన నిర్వహించడం శుభపరిణామమని అన్నారు. తద్వారా భారత అభివృద్ధిని మరింత వేగవంతం చేసి, వికసిత భారత్ లక్ష్య సాధనకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో ఈ మహత్తర జాతీయ కార్యక్రమాన్ని కాగితాలతో పనిలేకుండా డిజిటల్ సాధనాలతో నిర్వహించడం, పౌరులకు స్వీయ-ఎన్యూమరేషన్ అవకాశాన్ని కల్పించడం ద్వారా జనగణన దిగ్విజయవంతం అవుతుందని అన్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు స్వీయ-ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను సమర్పించేందుకు ముందుకు వస్తుండటం సంతోషదాయకమని చెప్పారు. ప్రతి ఒక్కరూ అధికారిక పోర్టల్ https://se.census.gov.in ను సందర్శించి స్వీయ-ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News