Breaking News: త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ..? అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి..

Telangana: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఉండబోతుందా..?

Update: 2021-11-16 13:39 GMT

త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ..? అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి..

Telangana: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఉండబోతుందా..? ఏ సామాజిక వర్గం వారికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు..? కేబినెట్ విస్తరణ ఉంటుందా? లేక ఎవరికైన మంత్రి పదవి ఇచ్చి కేబినెట్‌ని ఫుల్ చేస్తారా? ఇప్పడిదే రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు నామినేషన్స్ దాఖలు చేశారు టీఆర్‌ఎస్ అభ్యర్థులు. అయితే మొదటి నుంచి అనుకున్న పేర్లకి భిన్నంగా కొత్త పేరుని తెరపైకి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం వరకు కూడా ఎవరు ఊహించని రాజ్యసభ ఎంపీ బండ ప్రకాష్‌ని ఎమ్మెల్సీ నామినేషన్ వేయాలని టీఆర్‌ఎస్ అధిష్టానం ఆదేశించింది. తెలంగాణ శాసనసభలో ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారికి నామినేషన్స్ పత్రాలు అందించారు అభ్యర్థులు. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అనూహ్యంగా కొత్త పేరుని తెరపైకి తేవడం పైనే అసలైన చర్చ జరుగుతుంది.

టీఆర్‌ఎస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలను మచ్చిక చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే కులాల వారిగా ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తుంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మళ్ళీ ఎమ్మెల్సీగా బండ ప్రకాష్ నామినేషన్ వేయడంపై రాజకీయ పార్టీలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ముదిరాజ్ సామాజిక నేతగా ఉన్న ఈటల రాజేందర్‌ని మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేసిన తరువాత ముదిరాజ్ సామాజిక వర్గం వాళ్ళు కేబినెట్‌లో లేకపోవడంతో ఆ సామాజికవర్గంలో ఉన్న నాయకునికి మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే రాజ్యసభ ఎంపీగా ఉన్న బండ ప్రకాష్‌ని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి నామినేషన్ వేయించారని చర్చ సాగుతోంది.

ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం ఆరోగ్య శాఖని సీఎం నిర్వహిస్తూ వచ్చారు. దాదాపు ఆరు నెలల అనంతరం ఆర్ధిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్‌కి ఆరోగ్య శాఖ అదనపు బాధ్యతలు ఇచ్చారు. మరి ముదిరాజ్ సామాజికవర్గ నేతకి ఏ శాఖని అప్పజెప్పబోతున్నారు అనే చర్చ జరుగుతుంది. సీఎం కేసీఆర్ వద్ద రెవెన్యు శాఖ, ఇరిగేషన్‌ని ఏమైనా ఇస్తారా..? లేక వచ్చే ఎన్నికల ముందు కుల సమీకరణాలు ఆధారంగా మంత్రి పదవి ఇస్తారా? అనేది వేచి చూడాలి. మరోపైపు సిద్దిపేట కలెక్టర్‌గా పని చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన వెంకట్ రామిరెడ్డికి కూడా మంత్రి వర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉంది. రామిరెడ్డి రెవెన్యూ మీద చాలా పట్టు ఉండటంతో రెవెన్యూ శాఖ కూడా కేటాయించే చాన్స్ లేకపోలేదు.

రానున్న కొద్ది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఖాళీ అయిన ఈటల రాజేందర్‌తో పాటు హైదరాబాద్‌కు సంబంధించిన ఓ మంత్రిని కూడా తప్పించే యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ముదిరాజ్ సామాజికవర్గం నుంచి బండ ప్రకాష్‌కి మంత్రి పదవి ఇస్తారని టాక్. సీఎం కేబినెట్ విస్తరణ జరిపితే ఎవరు ఉంటారు ఎవరు బయటికి వెళ్తారు ఏ సామాజిక వర్గనికి పెద్దపీట వేయబోతున్నారు ఎవరిని మంత్రి పదవి వరిస్తుంది? అనే ఇలాంటి అంశాలపై ఆసక్తికర చర్చలు టీఆర్ఎస్‌లో జరుగుతున్నాయి.

Tags:    

Similar News