నిరుద్యోగుల నిరీక్షణ.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్థుల పడిగాపులు

Students: తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలపై నిరుద్యోగుల ఎదురుచూపుల పర్వం కొనసాగుతుంది.

Update: 2021-12-20 07:29 GMT

నిరుద్యోగుల నిరీక్షణ.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్థుల పడిగాపులు

Students: తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలపై నిరుద్యోగుల ఎదురుచూపుల పర్వం కొనసాగుతుంది. రెండేళ్లుగా నోటిఫికేషన్లపై ఎలాంటి ప్రకటన లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ శాఖల్లో దాదాపు 50 వేల ఉద్యోగ ఖాళీలుండగా కొత్త కొలువుల ప్రకటన చేస్తామన్న ప్రభుత్వ హామీలతో నగరంలోని స్టడీ పాయింట్లు, కోచింగ్ సెంటర్లు కిక్కిరిసిపోతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. కష్టపడి చదివి కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగులుతుంది. కన్నబిడ్డల భవిష్యత్ కోసం అప్పులు చేసి మరీ తల్లిదండ్రులు తమ పిల్లలను కోచింగ్ సెంటర్లు, ఇనిస్టిట్యూట్లలో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఇప్పటికే టీఎస్ పీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న 24 లక్షల 62 వేల మంది అభ్యర్థులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అదిగో ఉద్యోగాలు ఇదిగో నోటిఫికేషన్లంటూ యువతను మోసం చేస్తుందని విద్యార్థులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ హామీలను నమ్ముకుని హైదరాబాద్ బాట పడితే ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 2020 వరకు 1 లక్ష 32 వేల 899 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయినా పీఆర్సీ నివేదిక ప్రకారం ఇంకా భర్తీ చేయాల్సినవి 1 లక్ష 90 వేల ఖాళీలు ఉన్నాయంటున్నారు. ఎన్నికలప్పుడు ఉద్యోగాల భర్తీపై హామీలివ్వడం తరువాత వాటిని తుంగలో తొక్కడం ప్రభుత్వానికి పరిపాటి అయిపోయిందని మండిపడుతున్నారు. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌పై ప్రభుత్వం ఇప్పటికైనా ఓ నిర్ణయం తీసుకోవాలని నిరుద్యోగులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News