ములుగు జిల్లాలో అంతుచిక్కని వింత వ్యాధి: ఆరుగురి మృతి

Update: 2020-12-29 05:00 GMT

అంతుచిక్కని వ్యాధితో ఆ గ్రామమంతా అతలాకుతలమవుతోంది. 20 రోజుల వ్యవధిలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. జ్వరం, కడుపు ఉబ్బరం, రక్తంతో వాంతులు చేసుకుని ప్రాణాలొదులుతున్నారు. వైద్యులు పరిశీలించినా... వ్యాధి లక్షణాలు అంతుచిక్కడం లేదు. గ్రామానికి ఏదో సోకిందని ప్రజలు వలస వెళుతున్నారు.

ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలో వింత వ్యాధితో ఆరుగురు మృతి చెందారు. వ్యాధి లక్షణాలు వైద్యులకు అంతుపట్టడం లేదు. భయాందోళనకు గురవుతోన్న ప్రజలు గ్రామాన్ని విడిచి వెళ్తున్నారు. అంతుచిక్కని వ్యాధితో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించగా... మరో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు మరణించారు.

జబ్బు వచ్చిన మూడు రోజుల్లోనే జ్వరం, మర్నాడు పొట్ట ఉబ్బడం, ఆ మరుసటి రోజు రక్తపువాంతులు చేసుకుని మరణించడం వల్ల తమ గ్రామానికి ఏదో కీడు సోకిందని గ్రామస్థులు బయపడి ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. వింత వ్యాధి మరణాల గురించి తెలిసుకున్న వైద్యాధికారులు గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు.

72 మందికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, కరోనాతో పాటు మరికొన్ని పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 72 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్​ఓ అప్పయ్య తెలిపారు. ప్రత్యేక వైద్య బృందాలతో పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కలుషిత ఇందుకు కారణమని డీఎంహెచ్​ఓ అన్నారు. పరీక్ష కోసం కలుషిత నీటిని ల్యాబ్​కు పంపించామని తెలిపారు. మూఢనమ్మకాలతో ఎవరు కూడా ఊరిని విడిచి వెళ్లొద్దని సూచించారు. ఇప్పటికే మూఢనమ్మకాలపై కళాబృందం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Full View


Tags:    

Similar News