Vikarabad: మిస్టరీగా మారిన వికారాబాద్ శిరీష మృతి కేసు
Vikarabad: శిరీష మృతికేసును సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్
Vikarabad: మిస్టరీగా మారిన వికారాబాద్ శిరీష మృతి కేసు
Vikarabad: తెలంగాణలో సంచలనం రేకెత్తించిన శిరీష మృతికేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. వికారాబాద్ జిల్లాకు చెందిన శిరీష మృతిపై సమగ్ర వివరాలతో మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ డీజీపీని ఆదేశించారు. ఈ మేరకు డీజీపీకి ఛైర్‌పర్సన్ లేఖ రాశారని ఎన్‌సీడబ్ల్యూ ట్వీట్ చేసింది. బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె డీజీపీకి సూచించారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష మృతి కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. ఇంట్లో జరిగిన గొడవే ఆత్మహత్యకు పురిగొల్పి ఉంటుందని పోలీసులు భావిస్తున్నా గ్రామస్థులు మాత్రం కచ్చితంగా హత్యేనని ఆరోపిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ వైష్ణవి పర్యవేక్షణలో పోస్టుమార్టం జరిగిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే అక్క భర్త అనిల్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శిరీష మృతదేహాన్ని మరోసారి పరిశీలించాలని పోలీసులు కోరడంతో వైద్యాధికారిణి కాళ్లాపూర్ గ్రామానికి వెళ్లి పరిశీలించారు.
ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్లడంతోనే మృతి చెంది ఉంటుందని పోలీసులకు, గ్రామస్థులకు ఆమె వివరించారు. మరోసారి మృతదేహాన్ని పరీక్షించాల్సిన అవసరమేంటని గ్రామస్థులు, బంధువులు పోలీసులను ప్రశ్నించారు. ఇదే సమయంలో తండ్రి జంగయ్యను నిలదీశారు. శిరీష మృతికి ఆయనే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్సై విఠల్‌రెడ్డి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
శిరీషను అక్క భర్త అనిల్, తండ్రి జంగయ్య కొట్టి ఆమె వద్ద ఉన్న ఫోన్ తీసుకున్నారు. దాంతో మనోవేదనతో ఆమె ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించగా వారు అడ్డుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అనంతరం కొద్దిసేపటికే శిరీష ఇంటినుంచి బయటకు వచ్చింది. ఇద్దరూ చేయి చేసుకోవడంతోనే మనస్తాపం చెంది కుంటలో పడి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలోనే కళ్లకు కర్ర తగిలి గాయాలయ్యాయని, ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి మృతి చెంది ఉంటుందంటున్నారు. ఈ కేసును ఛేదించేందుకు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేశామని సీఐ వెంకట్రామయ్య తెలిపారు. శిరీష వాడిన ఫోన్ కాల్ లిస్టును సేకరించామని, అందులో ఆధారాలేవీ లేవన్నారు. ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి కాళ్లాపూర్ గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శిరీష అన్న శ్రీకాంత్‌తో మాట్లాడారు. అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేశారు.