సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి కొత్త రూపు.. ప్రపంచ హంగులతో అభివృద్ధి

ప్రపంచస్థాయి సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఊపందుకుంటున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పనులు ఈ స్టేషన్‌ను నాన్ సబర్బన్ గ్రేడ్-1 స్టేషన్‌గా గుర్తింపు 2023లో దాదాపు రూ.720 కోట్ల రూపాయలతో..

Update: 2025-10-27 09:48 GMT

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి కొత్త రూపు.. ప్రపంచ హంగులతో అభివృద్ధి

రైల్వే స్టేషన్లంటేనే ఇరుకిరుకుగా ఉంటాయి. సరైన సౌకర్యాలు ఉండవు. తదితర కారణాలు చెప్తారు. అయితే ఇకపై అలాంటి పరిస్థితి ఉండదంటున్నారు. ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్ అంతర్జాతీయ హంగులతో అందుబాటులోకి రాగా.. త్వరలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు ఎంతవరకు వచ్చాయి. పనులపై అధికారులు ఏమంటున్నారు..


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యంత బిజీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి. రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ స్టేషన్‌కు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ స్టేషన్‌లో సగటున రోజుకు 180 రైళ్లు ప్రయాణిస్తుండగా.. రోజుకు లక్షన్నరమంది రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఈ స్టేషన్‌కు రోజురోజుకీ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న స్టేషన్ ఏమాత్రం సరిపోవట్లేదు. దీంతో ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌ను నాన్ సబర్బన్ గ్రేడ్- 1 స్టేషన్‌గా గుర్తించబడింది. ఏడాదికి 5వందల కోట్ల ఆదాయం, 20 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణిస్తున్న స్టేషన్లు NSG- జీ1 స్టేషన్ కిందకు వస్తాయి. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో 2023లో దాదాపు 720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు ప్రారంభించారు ప్రధాని మోడీ.


ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 50శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. జీ ప్లస్ 3 అంతస్తులతో నార్త్ సైడ్ వైపున కొత్త ఐకానిక్ స్టేషన్ బిల్డింగ్స్, జీ ప్లస్ 3 అంతస్తులతో సౌత్ సైడ్ భవనం పనులు సాగుతున్నాయి. కేఫ్ ఏరియాలు, వినోద సౌకర్యాల కోసం స్థలాలు, ప్రయాణికుల సౌకర్యాలతో డబుల్ స్టోరీ స్కై కాన్కోర్స్ స్టేషన్‌ను సిద్ధం చేస్తున్నారు. పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నార్త్‌సైడ్ బహుళస్థాయి పార్కింగ్, సౌత్‌ సైడ్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ రానున్నాయి. నార్త్‌, సౌత్ వైపున రెండు ట్రావెలేటర్లతో సహా రెండు వాక్‌వేలు రానున్నాయి.

ఒక్కో వాక్ వే ఏడున్నర మీటర్ల విస్తీర్ణంతో విశాలంగా రూపుదిద్దుకుంటున్నాయి. అభివృద్ధిలో భాగంగా 26 లిఫ్ట్‌లు, 32 ఎస్కలేటర్లు, ట్రావెలేటర్లతో పాటు ఒక FOB నాలుగున్నర మీటర్లు, మరొక FOB 7 మీటర్లు, స్కైవాక్ 9 మీటర్లతో ప్రయాణికుల కోసం సిద్ధమవుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ..


రైలు ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ, మొబిలిటీ, ప్రయాణికులకు అనుకూలమైన పికప్, డ్రాప్ ప్రాంతాలు, తగినంత పార్కింగ్ సౌకర్యం, రద్దీని తగ్గించడం, నగర రహదారి నెట్‌వర్క్‌తో అనుసంధానించడం, వ్యాపార అవకాశాలు, ఆదాయ ఉత్పత్తిని సృష్టించడం దిశగా ఈ స్టేషన్ పునరాభివృద్ధి పనులు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. సౌత్ సైడ్ చేపడుతున్న బేస్మెంట్ నిర్మాణ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయని అధికారులు తెలుపుతున్నారు.

2025 నాటికి రైల్వే స్టేషన్ సిద్ధమవుతుందని చెబుతున్నప్పటికీ .. ప్రస్తుత పనుల దృష్ట్యా 2026 చివరి నాటికి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News