SC on Polavaram-Nallamala: నల్లమల సాగర్‌పై సుప్రీంలో వాదనలు.. విచారణ 12కి వాయిదా

SC on Polavaram-Nallamala: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో సోమవారం కీలక విచారణ జరిగింది.

Update: 2026-01-05 10:04 GMT

SC on Polavaram-Nallamala: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో సోమవారం కీలక విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఏపీ కేవలం టెండర్లకే పరిమితం: సుప్రీంకోర్టు

విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కేవలం ప్రాజెక్టు నివేదిక (DPR) కోసమే టెండర్లు పిలవాలని చూస్తోందని సీజేఐ అభిప్రాయపడ్డారు. "జాతీయ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన న్యాయ పరిధి ఉంటుంది. ఇప్పటికే కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసినందున, ఆ కమిటీ నివేదిక ఇచ్చే వరకు వేచి చూడాలి" అని ధర్మాసనం పేర్కొంది. ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం (Mediation) ద్వారా ఎందుకు పరిష్కరించుకోకూడదని ధర్మాసనం ఇరు రాష్ట్రాలకు సూచించింది.

తెలంగాణ తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు

తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ బలమైన వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి కేటాయింపుల ఉల్లంఘనకు సిద్ధమైందని, దీనివల్ల కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం వరద జలాల పేరుతో అదనపు నీటిని వాడుకోవాలని చూస్తోందని, తక్షణమే ఈ ప్రాజెక్టుపై స్టే (Stay) లేదా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. బేసిన్ పరిధిలో కేటాయింపులకు విరుద్ధంగా నీటి వినియోగం సాధ్యపడదని, దీనిపై సాంకేతిక నిపుణుల కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

సీజేఐ సంధించిన ప్రశ్నలు

సివిల్ సూట్‌లో జోక్యం చేసుకుని ప్రాజెక్టులను నిలుపుదల చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? అని సీజేఐ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం కేవలం వరద జలాలనే వాడుకుంటామని చెబుతున్నప్పుడు, అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం కేంద్రం పాత్రను గౌరవించాలని సూచించారు.

నా ఇల్లు - నా ఇష్టం: రోహత్గి ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ అభ్యంతరాలపై రోహత్గి స్పందిస్తూ.. "భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుకు సంబంధించిన నివేదిక (DPR) తయారు చేసుకుంటే పక్క రాష్ట్రానికి అభ్యంతరం ఎందుకు? నా ఇల్లు నేను కట్టుకోవాలనుకుంటే ఎదుటివారికి అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ తన సొంత భూభాగంలో ఈ ప్రాజెక్టును ప్రతిపాదిస్తోంది. రాయలసీమలోని కరువు ప్రాంతాలకు నీటిని అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం" అని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎక్కడా పాత తీర్పుల ఉల్లంఘన జరగడం లేదని ఆయన కోర్టుకు వివరించారు.

తెలంగాణ వందల ప్రాజెక్టులు కడుతోంది: ఏపీ లాయర్

ఏపీ తరఫున మరో న్యాయవాది జగదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ తీరును ఎండగట్టారు. "తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై ఎలాంటి అనుమతులు లేకుండా వందల సంఖ్యలో ప్రాజెక్టులు నిర్మిస్తోంది. అలాంటప్పుడు ఏపీ చేపడుతున్న ప్రాజెక్టు నివేదికపై అభ్యంతరం చెప్పడం సమంజసం కాదు" అని ధ్వజమెత్తారు.

విచారణ జనవరి 12కు వాయిదా

ఇరు రాష్ట్రాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం.. నదీ పరివాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాల (కర్ణాటక, మహారాష్ట్ర) అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అందరి వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలుపుతూ, తదుపరి విచారణను జనవరి 12కు వాయిదా వేసింది.

Tags:    

Similar News