Summer Heat: తెలంగాణలో భానుడి ఉగ్రరూపం
Summer Heat: తెలంగాణలో భానుడు అప్పుడే ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు.
Summer Heat:(ఫైల్ ఇమేజ్)
Summer Heat: తెలంగాణలో భానుడు ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. ఎండల తీవ్రతతో జనం అల్లల్లాడిపోతున్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళల పరిస్థితయితే చెప్పనవసరం లేదు. నిన్న ఈ సీజన్‌లోనే అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.8 నుంచి 42.7 డిగ్రీలుగా నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఇక, హైదరాబాద్‌లోనూ నిన్న ఎండ మండిపోయింది. ఖైరతాబాద్‌లోని గణాంకభవన్ వద్ద 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18-25.9 డిగ్రీలుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులపాటు సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో కరోనా తీవ్ర రూపం దాల్చతోంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భానుడు చూపుతున్న ప్రతాపంతో జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి రక్షించుకునేందుకు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. 24 గంటల పాటు ఇవి తిరుగుతూనే ఉంటున్నాయి. విద్యుత్ సరఫరాలో రెప్పపాటు అంతరాయం ఏర్పడినా.. తట్టుకోలేకపోతున్నారు. ఉష్ణోగ్రతలతో పాటు విద్యుత్ వినియోగం కూడా పెరిగింది.
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పండ్ల రసాల కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలకు చల్లటి నీళ్లతో పాటు పండ్ల రసాలను రెట్టింపు ధరలకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు శీతల పానీయాలను అధిక ధరలకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.