Revanth Reddy: మూసీలో ఏడాదంతా నీళ్లు ప్రవహించేలా ప్రణాళిక
Revanth Reddy: హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో నిజాం రాజుల కృషి అనన్యసామాన్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు.
Revanth Reddy: మూసీలో ఏడాదంతా నీళ్లు ప్రవహించేలా ప్రణాళిక
Revanth Reddy: హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో నిజాం రాజుల కృషి అనన్యసామాన్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. అసెంబ్లీలో మూసీ ప్రక్షాళనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల జలవనరులు ఎలా కలుషితమయ్యాయో వివరించారు.
నగరంలోని జలవనరులను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని సీఎం విమర్శించారు. కబ్జాలతో ఫాంహౌస్‌లు నిర్మించి, వాటి డ్రైనేజీలను జంట జలాశయాలకు కలిపి నీటిని కలుషితం చేశారని మండిపడ్డారు. అలాంటి అక్రమ కట్టడాలపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, డ్రైనేజీ కనెక్షన్లను తొలగించామని స్పష్టం చేశారు.
1908 వరదల తర్వాత నగరాన్ని రక్షించేందుకు 1922 నాటికి నిజాం ప్రభుత్వం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ప్రాజెక్టులను నిర్మించిందని గుర్తుచేశారు. నిజాంలు హైదరాబాద్‌ను ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దితే, గత పాలకులు ఆ గుర్తింపును కనుమరుగు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లాలోని మూసీ పరివాహక ప్రాంత ప్రజల కష్టాలను చూసి చలించే ఈ ప్రక్షాళన ప్రాజెక్టును చేపట్టినట్లు సీఎం తెలిపారు. మూసీలో ఏడాది పొడవునా నీళ్లు ప్రవహించేలా ప్రణాళికలు రూపొందించాం. ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని, మూడు సంస్థల జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. 20 టీఎంసీల గోదావరి నీటిని నగరానికి తరలించి, అందులో 15 టీఎంసీలు ప్రజల దాహార్తిని తీర్చడానికి, 5 టీఎంసీలు గండిపేటకు మళ్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
లండన్, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల్లో నదీ పరివాహక ప్రాంతాలను ఎలా వ్యాపార కేంద్రాలుగా మార్చారో తమ బృందం అధ్యయనం చేసిందని సీఎం వివరించారు. సబర్మతి రివర్ ఫ్రంట్ కోసం 60 వేల కుటుంబాలను తరలించారని గుర్తుచేశారు. గంగా నది ప్రక్షాళనను బీజేపీ తన ఎన్నికల అజెండాగా మార్చుకుందని, ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధిని తాము వ్యతిరేకించడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, మూసీ పరివాహక ప్రజల ఆరోగ్య రక్షణకు ఈ ప్రక్షాళన అత్యంత అవసరమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.