Telangana: ఠారెత్తిస్తున్న ఎండలు.. పాత రికార్డులను తిరగరాసేలా ఉష్ణోగ్రతలు
Telangana: ఠారెత్తిస్తున్న ఎండలు.. పాత రికార్డులను తిరగరాసేలా ఉష్ణోగ్రతలు
Telangana: ఫిబ్రవరిలోనే ఎండలు భయపెట్టిస్తున్నాయి. ఈ వేసవి పాత రికార్డులను బద్దలుకొట్టేలా ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మార్చి 15వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతన్నాయి. వారం రోజుల్లో మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, రామగుండం, ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు పెరిగాయి. ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతే.. ఇక ఏప్రిల్, మే నాటికి పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చని ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు 35.7 నుంచి 37.7 డిగ్రీల మధ్య నమోదు అయ్యాయి. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం జిల్లా రావినూతలలో 37.7 డిగ్రీల గరిష్ట, జనగాంలో 35.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అదేవిధంగా పెద్దపల్లి 37.6, భద్రాద్రి, జగిత్యాల, జోగులాంబగద్వాల తదితర జిల్లాల్లో 37.5 డిగ్రీల చొప్పున నమోదు అయినట్లు వాతావరణ శాఖ వివరించింది.