Private Schools Letter To CM Kcr : సీఎం సారూ మీరే మాకు దిక్కు

Update: 2020-09-24 03:57 GMT

Private Schools Letter To CM Kcr : కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలోని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలన్నీ నష్టాలల్లో కూరుకుపోయాయి. దీంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల సంఘం ఏకంగా సీఎం కేసీఆర్ కు లేఖ రాశాయి. కరోనాను కట్టడి చేయడానికి విధించిన లాక్ డౌన్‌తో తమపై పడ్డ తీవ్ర ప్రభావాన్ని పాఠశాలల సంఘం సీఎంకు వివరించింది. లాక్ డౌన్ కారణంగా తాము ఏవిధమైన సవాల్లను ఎదుర్కొంటున్నారో ఆ లేఖలో వారు స్పష్టంగా వివరించాయి.

ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు పరీక్షలు రాయకుండానే ప్రభుత్వం ప్రమోట్ చేయడం, అదే విధంగా పదో తరగతి విద్యార్థులను కూడా ఉత్తీర్ణులను చేయడంతో 2019-20 విద్యా సంవత్సరం ముగిసిందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ ఆ విద్యాసంవత్సరానికి సంబంధించిన ట్యూషన్ ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులు ఇంకా చెల్లించాల్సి ఉందని లేఖలో రాసారు. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కొన్ని ప్రైవేటు బడ్జెట్ స్కూళ్లు శాశ్వతంగా మూత పడ్డాయని, అదే బాటలో మరికొన్ని స్కూల్స్ కూడా ఉన్నాయని వివరించారు. ఈ బకాయిలు ఎప్పుడు వసూలు అవుతాయో తెలియని పరిస్థితి నెలకొందని వాపోయాయి. గత ఆరు నెలల నుంచి పాఠశాలలను నిర్వహించే పరిస్థితిలో తాము లేమని వాపోయారు. ప్రభుత్వం తమను నష్టాలనుంచి బయట పడేయాలని, తమ స్కూళ్లను స్వాధీనం చేసుకోవాలని సీఎంను కోరాయి. తెలంగాణలో విద్యను కాపాడాలని విజ్ఞప్తి చేశాయి.

విద్యార్థులకు స్కూళ్లతో సంబంధం లేకుండా పదో తరగతి పరీక్షలకు అనుమతి ఇస్తారని ప్రచారం జరుగుతోందని వారు తెలిపారు. అదే గనుక జరిగితే ఏ విద్యార్ధుల తల్లిదండ్రులు పాఠశాలలకు ఫీజులు కట్టరని వారు తెలిపారు. స్కూళ్లని స్వాధీనం చేసుకొని టీచర్లకి జీతాలు చెల్లించాలని, భవన అద్దెలు, ఇతర బిల్లులను చెల్లించాలి'' అని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి దయనీయ పరిస్థితిలో బడ్జెట్ ప్రైవేటు పాఠశాలలను ప్రభుత్వానికి అప్పజెప్పడం తప్ప మరో గత్యంతరం లేదు. ఇప్పటికే కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించినా విద్యార్ధుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేదని బాధను వ్యక్తం చేసారు. మూడున్నర లక్షల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కనీసం 50 శాతం జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని వివరించారు. కనీసం తల్లిదండ్రులు ట్యూషన్ ఫీజు కూడా చెల్లించడం లేదని అన్నారు. దీంతో టీచింగ్ స్టాఫ్‌ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.

Tags:    

Similar News