యాసంగి పంట కొనుగోళ్లలో అధికారుల జాప్యం!

*నెల రోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల ఆరోపణ

Update: 2022-06-07 04:21 GMT

యాసంగి పంట కొనుగోళ్లలో అధికారుల జాప్యం!

Telangana: తెలంగాణలో యాసంగిలో పండించిన వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రోహిణి కార్తె ముగిసి, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి అడుగుపెట్టే సమయం సమీపించినా తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో వరి కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం ములుగుతోంది. మరోవైపు అకాల వర్షాలతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. వర్షాలకు నానిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, మెదక్‌ జిల్లాల్లో కురిసిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఇదిలా ఉంటే రైతులు పండించిన మరో 10లక్షల టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈ నెల 10 వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే కురిసిన వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్ల వానతో కల్లాలు, మార్కెట్‌ యార్డుల్లో దాచుకున్న ధాన్యం నీటి పాలు కావడంతో పాటు, రంగు మారిందని రైతులు వాపోతున్నారు. ఇప్పుడు రుతుపవనాల ప్రభావంతో మరోసారి వర్షాలు పడితే తమ పరిస్థితి మరింత దుర్భరమయ్యే అవకాశాలు ఉన్నాయని కర్షకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ధాన్యం కొనుగోళ్లలో అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. తాము తీసుకొచ్చిన ధాన్యాన్ని నెల రోజులైనా కొనుగోలు చేయడం లేదని, నిలదీస్తే తమ వద్ద సిబ్బంది లేరని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. రోజూ కొనుగోలు కేంద్రాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని లారీల్లో ఎక్కించి పంపించేందుకు కూడా అధికారులు వెనకాడుతున్నారని, నిలదీస్తుంటే తమ వద్ద హమాలీల కొరత, లారీలు రావడం లేదని సమాధానం చప్పి, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబడుతున్నారు.

తరుగు తీస్తానంటే ఒప్పుకోలేనందుకు తన వడ్లను కాంటా వేయట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మంచిర్యాల జిల్లా సోమన్‌పల్లికి చెందిన ఓ రైతు. కష్టపడి పండించిన ధాన్యాన్ని బస్తాకు 2 కిలోల చొప్పున కోత పెడతామని మిల్లర్‌ నిర్వాహకులు చెప్పగా ప్రభుత్వం చెప్పినట్లు ఎలాంటి కోత లేకుండా వడ్లు కొనాలని ఆ రైతు డిమాండ్ చేశాడు. దీంతో నిర్వాహకులు.. నెల రోజులుగా వడ్లను కొనుగోలు చేయకపోవడంతో బాధితుడు కొనుగోలు కేంద్రం వద్దే పడిగాపులు కాస్తు్న్నాడు. ఇదే విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

మరోవైపు ఇతర రాష్ట్రాల రైతులు పెద్దఎత్తున ధాన్యాన్ని తెలంగాణకు తీసుకువచ్చి అమ్ముతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని తెలంగాణకు లారీల్లో తరలిస్తున్నారన్న సమాచారంతో రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. మొత్తం 51 చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు నిఘా తీవ్రతరం చేశారు. ఆయా రాష్ట్రాల నుంచి వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి, రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. 

Full View


Tags:    

Similar News