కరోనా వ్యాప్తి కొత్త విధానాలను ప్రోత్సహించేందుకు తోడ్పాటునిస్తోంది. కొత్త అలవాట్లు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తోంది. అందరికంటే దీనివల్ల ఎక్కువగా నష్టపోయింది విద్యార్థులే. తరగతుల నుంచి అన్ని వ్యవహారాల్లో వీరు సమూహాలుగా ఉండే అవకాశం ఉండటంతో వీరికి జరిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయాలనే దానిపై ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. సరిగ్గా విద్యాసంవత్సరం మరో నెల రోజుల్లో ముగుస్తుందన్న సమయంలో ఈ రాకాసి విలయం ముంచుకు రావడంతో ఏం చేయాలో పాలుపోని యంత్రాంగాలు ప్రస్తుతం వాటిని భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగా విద్యార్థులకు అన్లైన్ పాఠాలు నిర్వహించేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించడగా, తాజాగా తెలంగాణా సైతం ఇదే విధానాన్ని కొనసాగించేందుకు ముందుకు వచ్చింది. ఈ నెలాఖరు నుంచి వీటిని నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.
కరోనా వైరస్ కారణంగా విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్ధులకు ఆన్‌లైన్ పాఠాలు చెప్పేందుకు రంగం సిద్దం చేస్తుండగా. తెలంగాణ విద్యాశాఖ కూడా అదే కోవలో ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు సిద్దమైంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ ఛానల్‌ను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ డీఈఓ వెల్లడించారు. జూన్ చివరి వారం నుండి యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. మొదటిగా పదో తరగతి విద్యార్ధులతో ప్రారంభించి ఆ తర్వాత మిగిలిన తరగతులకు నిర్వహించనున్నారు. రికార్డెడ్, లైవ్ ద్వారా ఉపాధ్యాయులు విద్యార్ధులకు పాఠాలను బోధించనున్నారు. కాగా, త్వరలోనే ఆన్లైన్ తరగతుల కోసం ఓ వెబ్‌సైట్‌ను కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.