Vasalamarri: వాసాలమర్రిలో కొనసాగుతోన్న సీఎం కేసీఆర్ పర్యటన

Vasalamarri: గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసిన కేసీఆర్‌ * ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి పలకరించిన సీఎం కేసీఆర్‌

Update: 2021-06-22 10:29 GMT

వాసాలమర్రి లో సీఎం కెసిఆర్ పర్యటన (ఫైల్ ఇమేజ్)

Vasalamarri: ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో పర్యటిస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత స్వాగతం పలికారు. అనంతరం, 3వేల మంది గ్రామస్తులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ సహపంక్తి భోజనం చేశారు. సీఎం కేసీఆర్ టూర్‌లో కేవలం వాసాలమర్రి గ్రామస్తులే పాల్గొనేలా ప్రత్యేకంగా పాస్‌లు జారీ చేశారు. ఇక, ముఖ్యమంత్రి కేసీఆర్ రాకతో వాసాలమర్రి గ్రామస్తులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు.

వాసాలమర్రి సహపంక్తి భోజనాల్లో 23 రకాల వంటకాలను వడ్డించారు. మటన్, చికెన్, ఫిష్, బోటీ, తలకాయ కూర, గుడ్డు, పప్పు, పచ్చిపులుసు, రెండు రకాల స్వీట్లు, పాలక్‌ పన్నీర్, బిర్యానీ రైస్, పులిహోర, సాంబారు, రసం, వంకాయ, ఆలుగడ్డ, మసాల పాపడాలు, చట్నీలు, చల్లచారు తదితర వంటకాలతో పసందైన విందు చేశారు. ఇక, ముఖ్యమంత్రి కేసీఆర్‌‌తో కలిసి సహపంక్తి భోజనాలు చేసిన గ్రామస్తులు సంతోషంలో మునిగితేలుతున్నారు.

తెలంగాణ ఉద్యమకాలం నుంచి కేసీఆర్ కు వెన్నుదన్నుగా ఉన్న ఈ మారుమూల పల్లెకు ఇప్పుడు మహర్దశ పట్టబోతోంది. సీఎం రాకతో వాసాలమర్రి రూపురేఖలు పూర్తిగా మారనున్నాయన్న విశ్వాసంతో గ్రామస్తులు ఉన్నారు. ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారులు, పాఠశాలలు, పింఛన్లు, మౌలిక సదుపాయాల కల్పన, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, యువతకు ఉపాధి అవకాశాలు, వ్యవసాయం, పాడిపరిశ్రమతో పాటు గ్రామ సమగ్రాభివృద్ధి ప్రణాళికను సర్పంచ్ అధ్యక్షతన జరిగే సభలో ఆమోదించనున్నారు.

గ్రామ సమగ్రాభివృద్ధికి అధికారులు ఇప్పటికే ప్రణాళిక రూపొందించి నివేదిక సిద్ధం చేశారు. శిథిలావస్థలో ఉన్న 670 పాత ఇళ్ల స్థానంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించనున్నారు. అలాగే 5వేల మీటర్ల మేర సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, గ్రామ పంచాయతీ భవనం, రెండు అంగన్ వాడి భవనాలు, 120 మంది యువతకు రుణాలు, స్కిల్, అన్ స్కిల్డ్ యువతకు స్వయం ఉపాధి పథకాలు, వాహనాలు, హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, డెయిరీ యూనిట్లు, సీడ్ ప్లాంట్, వ్యవసాయ బోరు బావులు, ఫంక్షన్ హాల్, పీహెచ్ సీ సెంటర్, విద్యుత్ సబ్ సెంటర్, పాడిపశువుల పంపిణీ, భూమి లేని రైతు కూలీలకు భూములు, పంటల రక్షణకు అటవీ భూముల చుట్టూ కంచె ఏర్పాటుతో పాటు మరికొన్ని అంశాలపై గ్రామసభలో తీర్మానం చేయనున్నారు. 

Tags:    

Similar News