Kothagudem: తల్లీబిడ్డ మృతి.. మాతాశిశు కేంద్రంలో ఆగని మరణాలు

Kothagudem: సింధు మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Update: 2024-01-27 13:12 GMT

Kothagudem: తల్లీబిడ్డ మృతి.. మాతాశిశు కేంద్రంలో ఆగని మరణాలు

Kothagudem: కొత్తగూడెంలోని రామవరం మాతాశిశు కేంద్రంలో మరణాలు ఆగడం లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా జిల్లాలో మాతా శిశు మరణాలు కలవర పెడుతున్నాయి. సకాలంలో వైద్యం అందకపోవడం, వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణులు, బాలింతలు మృత్యువాత పడుతున్నారు. పుట్టిన వెంటనే శిశువులకు నాణ్యమైన సంరక్షణ లేకపోవడంతో లోకాన్ని చూడకుండనే చిన్నారులు కన్నుమూస్తున్నారు.

ఈనెల 24న రాత్రి కొత్తగూడెం ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణీ చింతాల సింధు, అలాగే నవజాత శిశువు మృతి చెందిన హృదయ విదారక ఘటన జరిగింది. తల్లీబడ్డలు క్షేమంగా వస్తారని, బోసినవ్వులతో తమ ఇంట్లో ఓ పసిపాప తిరుగుతుందని ఆ కుటుంబ సభ్యులు కలలు కన్నారు. కానీ విధి మరోలా తలచింది. వైద్యుల నిర్లక్ష్యంతో తల్లీబిడ్డలు దక్కలేదు. బాధిత కుటుంబాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పరామర్శించి ఓదార్చారు.

సింధు మృతికి కారకులైన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోవాలని పైస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. కొత్తగూడెం జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తపరిచారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మృతురాలి కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ విషయంపై ముఖ్యమంత్రికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాయనున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News