తొలకరికి స్వాగతం..ఈసారి వర్షాలు ఆశాజనకమే

Update: 2019-06-21 16:05 GMT

ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వరుణుడు కరుణించి తొలకరి పలకరించింది. వేసవితాపంతో వేడేక్కిన అవని పులకించింది. భానుడి ప్రతాపానికి బ్రేక్‌ వేస్తూ ఆకాశం నుంచి జారిపడ్డ చినుకులు తెలుగు నేలను ముద్దాడాయి. ఈ ఏడు ఆశాజనకంగానే వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఇవాళా రేపూ అంటూ ఊరించిన నైరుతి రుతుపవనాలు 15 రోజుల ఆలస్యంతో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. నిన్న ఏపీని పలకరించిన రుతుపవనాలు ఇవాళ తెలంగాణలోకి ప్రవేశించాయి. కోస్తాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఇటు తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. దీంతో వర్షాకాలం మొదలైనట్లైంది. రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రం మొత్తం విస్తరిస్తాయని దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇటు హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మియాపూర్‌ నుంచి దిల్‌షుక్‌ నగర్‌ వరకు సికింద్రాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్, పాతబస్తీతో పాటు పలుచోట్ల వర్షం కురిసింది. దీంతో ఇన్నిరోజులు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ జనం ఉపశమనం పొందారు.

మరోవైపు ఏపీలో గురువారం నుంచే వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వర్షం రావడంతో రైతులు కూడా ఖరీఫ్‌ పనులు ముమ్మరం చేశారు. వానల కోసం ఎదురుచూసిన అన్నదాతలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.  

Tags:    

Similar News