Neredugommu: మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా: రమావత్ రవీంద్ర
మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
నేరేడుగొమ్ము: మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం మండలం సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని, గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అని తెలిపారు. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పనులలో అధికారులు అలసత్వం వహించవద్దని అన్నారు. 6400 మందికి 3800మంది మాత్రమే రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది అని, మిగిలిన మండలంలో 2600మంది రైతులు రైతు బీమా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
మండలంలో బీటి రోడ్లు, మెటల్ రోడ్లకు ప్రతిపాదనలు పంపామని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మిషన్ భగీరథ 45వేల కోట్లతో గ్రామాల్లో సురక్షిత త్రాగునీటి కోసం, ప్రాధాన్యతనిస్తూ పనులు చేయడం జరిగిందని ఆయన అన్నారు. మిషన్ భగీరథ పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు తెలిపారు. మిషన్ భగీరథ పనులను పూర్తి చేయాలని గ్రామాలకు తాగు నీరు అందించాలని అధికారులను సూచించారు. అధికారులు ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజా ప్రతినిధులు తమ గ్రామాలకు అభివృద్ధి కోసం అడిగే పనులను తప్పకుండా చేయాలని ఆయన అన్నారు.
వివిధ శాఖలకు సంబంధించి గౌరవ ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల అధికారులు సమస్యలపై పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే సమక్షంలో తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, అధికారులు ప్రతి ఒక్కరు తమ యొక్క విద్యుక్త ధర్మాన్ని పాటించాలని ఆయన అన్నారు. మండలానికి సంబంధించి అన్ని విధాలుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేరడుగొమ్ము మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ బాణావత్ పద్మహన్మ నాయక్, జడ్పీటీసీ కేతవత్ బాలు నాయక్, వైస్ ఎంపీపీ అరేకంటి ముత్యాలమ్మరాములు, ఎంపీడీఓ మాధవి, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.