నల్గొండలో కోమటిరెడ్డి మార్క్ యాక్షన్.. తెల్లవారుజామునే ఫుట్‌పాత్‌ల క్లీనింగ్.. రెండేళ్లలో భాగ్యనగరంలా మారుస్తానని హామీ!
Komatireddy Venkat Reddy: రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత నియోజకవర్గం నల్గొండలో మరోసారి దూకుడు ప్రదర్శించారు.
Komatireddy Venkat Reddy: రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత నియోజకవర్గం నల్గొండలో మరోసారి దూకుడు ప్రదర్శించారు. పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన, మంగళవారం తెల్లవారుజామున నల్గొండ పట్టణంలో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఎవరూ ఊహించని విధంగా ఉదయాన్నే రోడ్లపైకి రావడంతో అధికారులంతా పరుగులు తీశారు.
ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రకాశం బజార్ ప్రాంతంలో ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురికావడాన్ని మంత్రి గమనించారు. ఎన్నో ఏళ్లుగా ఈ ఆక్రమణల వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి, వెంటనే వాటిని దగ్గరుండి తొలగింపజేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి విస్తరించిన దుకాణాలను మున్సిపల్ అధికారుల సాయంతో తొలగించారు.
ఈ సందర్భంగా ఫుట్‌పాత్ వ్యాపారులతో మాట్లాడిన మంత్రి, వారికి ప్రత్యామ్నాయం చూపుతామని హామీ ఇచ్చారు. "మీ పొట్ట కొట్టడం మా ఉద్దేశ్యం కాదు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. స్ట్రీట్ వెండర్స్ కోసం త్వరలోనే వేరే చోట ప్రత్యేక స్థలాలు కేటాయిస్తాం" అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
పట్టణ సుందరీకరణపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. "వచ్చే రెండేళ్లలో నల్గొండ రూపురేఖలను పూర్తిగా మారుస్తాను. హైదరాబాద్ తరహాలో నల్గొండను అభివృద్ధి చేసి చూపిస్తా. రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, ఆధునిక సదుపాయాలతో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా" అని ధీమా వ్యక్తం చేశారు.