Ibrahimpatnam Municipal Elections: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం

Ibrahimpatnam Municipal Elections: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్‌ఎస్ పార్టీ దక్కించుకుంది.

Update: 2026-02-17 06:30 GMT

Ibrahimpatnam Municipal Elections: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్‌ఎస్ పార్టీ దక్కించుకుంది. నిన్నటి నుంచి కొనసాగుతున్న హైడ్రామాకు నేడు ఓటింగ్ ప్రక్రియతో తెరపడింది. అయితే, ఈ ఎన్నికల ప్రక్రియ అత్యంత ఉద్రిక్తతల మధ్య, భారీ ఘర్షణల నడుమ సాగడం గమనార్హం.

మున్సిపల్ కార్యాలయంలో ఓటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా ముదిరి పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఇరు పార్టీల కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ తోపులాటలో పలువురు కౌన్సిలర్లకు స్వల్ప గాయాలయ్యాయి.

పరిస్థితి తీవ్రతను ముందే పసిగట్టిన పోలీసులు సుమారు 800 మంది బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘర్షణ మొదలవ్వగానే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ నేతల మధ్య జరిగిన ఈ ఘర్షణ స్థానికంగా కలకలం రేపింది.

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉండగా, మెజారిటీ కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్‌ఎస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. క్యాంప్ రాజకీయాలు, ఎక్స్ అఫీషియో ఓట్ల చుట్టూ తిరిగిన ఈ రాజకీయం చివరకు ఉద్రిక్తతల మధ్య ముగిసింది. ఉత్కంఠ భరిత పోరులో గెలుపొందిన బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ శ్రేణులు అభినందనలతో ముంచెత్తాయి.

Tags:    

Similar News