Telangana: హైదరాబాద్‌ శివారులో లోకల్ డ్రగ్స్‌ కలకలం

Telangana: 8 కోట్లకు పైగా విలువ చేసే 140 కేజీల అల్ఫాజోలం డ్రగ్స్‌ స్వాధీనం

Update: 2021-03-16 04:14 GMT

ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా

Telangana: హైదరాబాద్‌ న‌గ‌ర శివార్లలోని ఫార్మా కంపెనీలు డ్రగ్స్‌ తయారీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయా..? పేరుకు మాత్రం ఫార్మా కంపెనీలుగా ఉంటూ.. ఇల్లీగల్‌గా డ్రగ్స్‌ తయారీ కేంద్రాల్లా వ్యవహరిస్తున్నాయా? అస‌లు లోప‌ల ఏం జరుగుతోంది?

సైబ‌రాబాద్ ప‌రిధి బాలాన‌గ‌ర్, జీడిమెట్ల ప్రాంతాల్లోని ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాల్లో ఫార్మా కంపెనీలపై ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి. గ‌తంలో కూడా పలుమార్లు పోలీసులు దాడులు చేసి కొన్ని కంపెనీల‌ను మూసివేసిన సందర్భాలు లేకపోలేదు. అయినప్పటికీ ఇంకా కొన్ని ఫార్మా కంపెనీల ముసుగులో నిషేధిత డ్రగ్స్‌ తయారీ యద్ధేచ్ఛగా సాగుతోంది. పోలీసులు నామమాత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకోవడంతో అండర్ గ్రౌండ్‌ అపరేషన్‌గా, ఎవరికీ అనుమానం రాకుండా తమ చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు కొందరు.

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో లోకల్‌ మేడ్‌ డ్రగ్స్‌ ముఠా పట్టుబడడంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. లింగాగౌడ్‌ చేసింది పీహెచ్‌డీ. పేరుకే ఉన్నత విద్య చేసేది మాత్రం చీకటి దందా.. చ‌దువుకున్న స‌బెక్టుపై ప‌ట్టు ఉండ‌డంతో ఓ ముఠాగా ఏర్పడి, డ్రగ్స్‌ తయారీ చేసేందుకు సిద్దమయ్యాడు. కళ్లు కాంపౌండులే టార్గెట్‌గా వ్యాపారం స్టార్ట్ చేసింది ఈ ముఠా. ఎవ్వరికీ అనుమానం రాకుండా హైదరాబాద్‌లో కొంతకాలం బిజినెస్‌ సాగించింది. అయితే.. పోలీసుల నిఘా పెరిగిందనే ఉద్దేశంతో విజయవాడ కేంద్రంగా డ్రగ్స్‌ తయారు చేసి, వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తోంది ముఠా.

ఇందులో భాగంగా విజయవాడలో తయారు చేసిన డ్రగ్స్‌ను రెండు కార్లలో నగరానికి తరలించారు. అయితే.. సింథటిక్ డ్రగ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ జరుగుతోందన్న పక్కా సమాచారంతో జీడిమెట్ల పైప్‌‌లైన్‌ రోడ్డులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. బాలానగర్‌ ఎస్వోటీ పోలీసులు, పేట్‌ బషీర్‌బాగ్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో.. రెండు కార్లలో తరలిస్తున్న దాదాపు 8 కోట్లకు పైగా విలువ చేసే 140 కేజీల అల్ఫాజోలం డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

లోకల్‌ డ్రగ్స్‌ తయారీ కేసులో పట్టుబడిన ముఠా.. మెద‌క్, సంగారెడ్డితో పాటు ఇత‌ర ప్రాంతాల్లో కూడా డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న లింగాగౌడ్ కు న‌గ‌రంలో ఓ ల్యాబొరేటరీ ఉంద‌ని గుర్తించారు పోలీసులు. దాని కేంద్రంగా కొన్నిరోజులు ఇక్కడ డ్రగ్స్‌ తయారు చేశారని, ఆ తర్వాత విజయవాడలోని తన స్నేహితుడి సహాయంతో తయారీ చేయడం స్టార్ట్ చేశాడని తెలిపారు. ఇప్పటి నుంచి జీడిమెట్ల, బాలానగర్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాల్లోని ఫార్మా కంపెనీలపై నిరంతర నిఘా ఉంటుందని బాలానగర్‌ డీసీపీ పద్మజ స్పష్టం చేశారు.

ఏదేమైనా ప్రజల వీక్‌నెస్‌ను క్యాష్‌ చేసుకొని డ్రగ్స్‌ ముఠాలు కోట్లు గడిస్తున్నాయి. ఇలాంటి ముఠాలతో పాటు ఫార్మా కంపెనీల పేరుతో డ్రగ్స్‌ తయారీ కేంద్రాలుగా మారిన వాటిపై కూడా పోలీసులు దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటే.. డ్రగ్ మాఫియాకు చెక్‌ పెట్టొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. 

Tags:    

Similar News