ఇందూరులో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు భూసేకరణ సమస్య

Update: 2020-08-22 07:54 GMT

Land issue for Airport in Nizamabad: ఇందూరులో ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూసేకరణ సమస్యగా మారింది. ఓ వైపు ప్రభుత్వం ఎయిర్ పోర్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తుంటే మరోవైపు రైతులు భూములు ఇచ్చేదే లేదని ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కావాల్సిన భూమిని సేకరించామని ప్రభుత్వానికి అధికారులు నివేదికలు ఇచ్చేశారు. కానీ తమ భూములు జోలికి వస్తే ఊరుకునేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఇందూరు ప్రజల ఎయిర్ పోర్టు కలకు భూసేకరణ సమస్యగా మారిందా రైతుల తీరు అధికారులకు తలనొప్పిగా మారిందా.


తెలంగాణలో ఆరు విమానాశ్రయాల నిర్మాణానికి ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్త గూడెం, బసంత్ నగర్, మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లిలో ఎయిర్ పోర్టు నిర్మాణాలకు కసరత్తులు మొదలు పెట్టింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పర్యటించారు. జక్రన్ పల్లిలో ఎయిర్ పోర్టు కోసం సేకరించిన భూమి జాతీయ రహదారికి సమీపంలో ఉండడం, చుట్టూ పక్కల జిల్లాలకు కలిగే లబ్ధి, తదితర అంశాలను పరిశీలించిన కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది.


ఇంకేముంది భూసేకరణ కోసం ప్రభుత్వం రెవెన్యూ అధికారులను రంగంలోకి దింపింది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు భూసేకరణ ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది. పట్టా భూములను ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి పరిసరాల్లో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం అనుకూలంగా ఉంది. ఈ మేరకు మనోహరాబాద్, తొర్లికొండ, కొలిప్యాక్, అర్గుల్, జక్రాన్ పల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో సుమారు 1610 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందులో 790 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 820 ఎకరాల పట్టా భూమి ఉంది. భవిష్యత్ విస్తరణకు మరో 360 ఎకరాలను అదనంగా రెవెన్యూ అధికారులు తమ ఆధీనంలో తీసుకునే ఆలోచనలో ఉన్నారు.


ఎయిర్ పోర్ట్ తో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం ఖాయం. స్థానిక రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తారని అధికారులు భావించారు. కానీ ఇప్పుడు రైతులు భూములిచ్చేందుకు ససేమిరా అనడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. అర్గుల్, కొలిప్యాక, తొర్లికొండ గ్రామాల్లో తమ పట్టా భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. సర్వే అధికారులు వస్తే అడ్డుకోవాలని గ్రామ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో తీర్మానాలు చేసుకున్నారు. ఈ మేరకు జక్రాన్ పల్లి తహసీల్దార్ కు ఆయా రైతులు వినతిపత్రం కూడా సమర్పించారు. ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తే వ్యవసాయాధారిత జిల్లాగా ఉన్న నిజామాబాద్ లో ఆహార అనుబంధ పరిశ్రమలు వచ్చే అవకాశముంది. దీంతో ఇందూరు వాణిజ్యపరంగా వేగంగా అభివృద్ధి సాధిస్తుంది. ఐతే రైతుల అభిప్రాయం తీసుకోకుండా, భూసేకరణ విషయంలో రైతులకు స్పష్టత ఇవ్వకుండా అధికారులు నివేదికలు సిద్ధం చేయడం వివాదంగా మారింది. మరీ ప్రభుత్వం రైతులను ఎలా బుజ్జగిస్తుందో చూడాలి.


Tags:    

Similar News