Hyderabad: కరోనా ఉధృతి తగ్గటంతో తిరిగి నగరబాట పట్టిన కూలీలు

Hyderabad: హైదరాబాద్ సిటీలో ఉపాధి మార్గాలు ఎక్కువ... వలస కూలీల సంఖ్య రెట్టింపు

Update: 2022-03-27 10:00 GMT

కరోనా ఉధృతి తగ్గటంతో తిరిగి నగరబాట పట్టిన కూలీలు

Hyderabad: జానెడు పొట్ట నింపుకోవడం కోసం ఊరు కానీ ఊరు నుంచి వేల కిలోమీటర్ల దూరం నుండి పట్నం బాట పట్టిన వలసకూలీల బతుకులు దుర్భరమవుతున్నాయి. చాలీ చాలని జీతంతో బతుకు వెళ్లదీస్తున్నారు. రోజంతా కష్టపడినా పూట గడవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్న తల్లిదండ్రులను భార్యా పిల్లలను వదిలి ఊరుకాని ఊరు వస్తున్న వలస కూలీల జీవితాలు గాల్లో దీపాలవుతున్నాయి. ఉపాధి కోసం భాగ్యనగరానికి వచ్చిన వలస కూలీల దీన పరిస్థితిపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్టు.

ఉపాధి కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి నగరానికి వలస వస్తున్నారు. తెల్లవారు జాము నుంచే అడ్డాలపై నిలబడి పని కోసం ఎదురుచూస్తుంటారు. పని దొరికిన రోజు చేసుకుంటూ లేకపోతే ఉసూరుమంటూ వెనక్కిపోతుంటారు. రేయింబవళ్లు చమటోడ్చి పని చేసిన శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందరో వలస వచ్చిన కూలీల జీవితాలకే కాదు.. వారి ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. చాలీ చాలని గదుల్లో గదుల్లో ఉంటూ జీవనం సాగిస్తున్న కూలీల బతుకులు తెల్లారుతున్నా శాశ్వత నిద్రలోకి జారుకుంటున్నా అడిగే వారు లేకుండా పోతున్నారు.

పిల్లా జెల్లా ఇంటి కాడ ఎట్టా ఉన్రో నా ముసలి తల్లి ఏమి వెట్టి సాదుతుందో పూట పూట చేసుకోని బతికెటోళ్లం పూట గడువ ఇంత దూరం వచ్చినోళ్లం. వలస కూలీల జీవితాలను కళ్లకు కట్టే పాట వింటే చాలు చమర్చని కన్ను ఉండదు. అత్యంత వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ సిటీలో ఉపాధి మార్గాలు ఎక్కువగా ఉండటంతో ఇక్కడకు వచ్చే వలస కూలీల సంఖ్య రెట్టింపు అయ్యింది. భవన నిర్మాణ కూలీలతో పాటు ఇక్కడి పరిశ్రమల్లో పని చేయడానికి బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, ఒడిస్సా, అస్సోం, మణిపూర్ తదిర రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన కార్మికులు కూలీ నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

పని కోసం నగరానికి వలస వచ్చిన వారిలో కొందరు భవన నిర్మాణ కార్మికులుగా, హోటల్ కార్మికులుగా, పారిశుద్య కార్మికులుగా, హమాలీలు, రవాణా కార్మికులు, ఇండ్లలో పని చేసే వారిగా, సెక్యురిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇలా వలస వచ్చిన ఎందరో కూలీలు పని దొరక్క సొంతూర్లకు తిరిగివెళ్లారు. మరికొందరు ఇక్కడే ఉండి పోయారు. అప్పట్లో వలస కూలీల జీవితాలపై పెద్దఎత్తున చర్చ కూడా జరిగింది. ప్రభుత్వాల అనాలోచిత లాక్ డౌన్ కారణంగా వేల కిలోమీటర్లు పిల్లా పాపలతో నడిచివెళ్లిన తీరు అందర్ని కంట తడిపెట్టించింది. కొందరైతే తమ గమ్య స్థానాలకు చేరుకోకుండానే ప్రాణాలు వదిలిన ఘటనలు వెలుగు చూశాయి.

కరోన ఉదృతి తగ్గి లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి నగర బాట పట్టిన వారిలో కొందరు పనిలో చేరినప్పటికీ మరికొందరు పని కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కో సందర్భంలో పని దొరికినా సరైన కూలీ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News