ఆరోగ్యశ్రీలో కరోనా ను చేర్చాలనే విజ్ఞప్తిని సీఎం దృష్టికి తీసుకెళ్తా..కేటీఆర్

Corona Treatment With Arogyashree: పేద, మధ్యతరగతి ప్రజలకు కరోనా చికిత్స పెనుభారంగా మారాయనే వాదనతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు

Update: 2021-05-14 07:24 GMT

Ask KTR:(File Image)

Corona Treatment With Arogyashree: యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా చికిత్స చాలా ఖరీదైనదే. అంత ఖర్చు పెట్టినా బతికిబట్టకట్టడం కష్టంగా మారింది. అంతే కాకుండా కుంటుంబాల్లో కల్లోలాలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ ఎక్కువ మంది నుంచి వస్తున్న విజ్ఞప్తిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. 'కేటీఆర్‌ను అడగండి(ఆస్క్‌ కేటీఆర్‌)' పేరిట ట్విటర్‌లో గురువారం నెటిజన్లు వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.

కొవిడ్‌ చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నాయని, అవి పేద, మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారాయనే వాదనతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. వాటిని సమీక్షించి, క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందన్నారు. చికిత్స ఖర్చు విషయంలో జాతీయ స్థాయిలో ఏకీకృత విధానం రూపొందించాలనే సూచనపై సమీక్షిస్తామన్నారు. కరోనా సమయంలో రాష్ట్రాలకు సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఇస్తే పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన గ్లోబల్‌ టెండర్లలో కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌ తయారీదారులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. త్వరలోనే ఫైజర్‌, మోడర్నా కంపెనీల టీకాలకూ అనుమతి లభిస్తుందని, ఆగస్టు నెలాఖరుకు దేశీయంగా బయోలాజికల్‌-ఈ తయారుచేస్తున్న వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్రంలోని జనాభాకు టీకాలను సేకరించడం సవాలేనని, దాన్ని త్వరలోనే అధిగమిస్తామన్నారు.

కరోనా నియంత్రణపై రాజకీయ దురుద్దేశంతో కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. ప్రస్తుతం తెలంగాణలో లాక్‌డౌన్‌ సమర్థంగా అమలవుతోందని, ప్రజలకు నిత్యావసరాల లభ్యత కోసమే నాలుగు గంటలపాటు మినహాయింపునిచ్చామన్నారు. ఇ-కామర్స్‌ సేవలూ అందుబాటులో ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ను పొడిగించాలా? వద్దా? అనే అంశాన్ని ఈ నెల 20న జరిగే మంత్రిమండలి సమావేశం నిర్ణయిస్తుందన్నారు. త్వరలో ప్లాస్మా దానం చేస్తానన్నారు.

Tags:    

Similar News