కాంగ్రెస్‌లో కాళేశ్వరం కయ్యం

Update: 2019-06-19 12:19 GMT

టీకాంగ్రెస్‌లో కాళేశ్వరం కయ్యం కలకలం రేపుతోంది. తెలంగాణ వరప్రదాయిని అంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెబుతోన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ నేతలు తలోమాట మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అవినీతిమయమంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర విమర‌్శలు చేస్తే అందుకు భిన్నంగా కాళేశ్వరం అద్భుతమంటూ సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మెదక్ జిల్లాకు పెద్ద వరమంటోన్న జగ్గారెడ్డి తన నియోజకవర్గానికి కూడా సాగు-తాగు నీరు అందుతుందన్నారు. ప్రజలకు మేలుచేసే ప్రాజెక్టులపై రాజకీయం వద్దన్న జగ్గారెడ్డి కాళేశ్వరాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదంటూ భట్టి వ్యాఖ్యలతో విభేదించారు. కాళేశ్వరం ప్రారంభోత్సవాన్ని అందరూ స్వాగతించాల్సిందేనన్న జగ్గారెడ్డి కాళేశ్వరం ఓపెనింగ్‌కి జగన్‌, ఫడ్నవిస్ రావడమే శుభపరిణామం అన్నారు.

తనకు ప్రజల ప్రయోజనాలే ముఖ్యమంటోన్న జగ్గారెడ్డి ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు వద్దంటూ కాంగ్రెస్‌ నేతలకు సూచిస్తున్నారు. కాళేశ్వరం ఓపెనింగ్‌కు ఏపీ సీఎం జగన్‌ను భట్టి రావొద్దనడాన్ని కూడా జగ్గారెడ్డి తప్పుబట్టారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన‌ వస్తే తప్పేంటని ప్రశ్నించారు. మరి జగ్గారెడ్డి వ్యాఖ్యలపై భట్టి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

మంచి పని ఎవరు చేసినా సమర్ధించాలన్నారు జగ్గారెడ్డి. సోనియా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వగలిగారన్న జగ్గారెడ్డి ప్రాజెక్టులు ఎవరు కట్టినా ప్రజల కోసమేనన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఎవరేమన్నా తాను కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Full View

Tags:    

Similar News