హైదరాబాద్ గడ్డ.. సైబర్ నేరాల అడ్డా..ఈ తరహా మోసాలే ఎక్కువ..అవేంటంటే?
Hyderabad: ఐటీ హబ్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న భాగ్యనగరం సైబర్ నేరాలకు కేంద్రంగా మారడం ఆందోళన కలిగిస్తోంది.
హైదరాబాద్ గడ్డ.. సైబర్ నేరాల అడ్డా..ఈ తరహా మోసాలే ఎక్కువ..అవేంటంటే?
Hyderabad: హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు అడ్డాగా మారింది. ఐటీ హబ్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న భాగ్యనగరం సైబర్ నేరాలకు కేంద్రంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. 2021లో దేశవ్యాప్తంగా 52,430 సైబర్ నేరాలు వెలుగుచూస్తే వాటిలో దాదాపు 20 శాతం తెలంగాణలోనే నమోదు కావడం విచారకరం. ఆర్థిక మోసాల కోణంలో జరిగే సైబర్ నేరాలు తెలంగాణలోనే అధికంగా ఉన్నాయి. 2022లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15,217 నేరాలు నమోదు అయితే వాటిలో 12,272 కేసులు ఆర్థిక మోసాలకు సంబంధించినవే కావడం కలవరపెడుతోంది. 2019లో 2,691 సైబర్ నేరాలు జరిగితే...గతేడాది ఏకంగా 15,217 కేసులు నమోదు అయ్యాయి. అంటే మూడేళ్లల్లో సైబర్ మోసాలు ఐదున్నర రెట్లు పెరిగాయి.
సైబర్ నేరాలను నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 800లకు పైగా పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా సైబర్ వారియర్లను ప్రభుత్వం నియమించింది. ప్రత్యేకంగా 500 మంది సిబ్బందితో సైబర్ సెక్యూరిటీ బ్యూరోను రాష్ట్ర డీజీపీ ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పోలీసులు సైబర్ నేరాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నా... సైబర్ కేటుగాళ్లు మాత్రం ఏదో ఒక రూపంలో రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రధానంగా వీరు ఓఎల్ ఎక్స్ వెబ్ సైట్ ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు. ఇక మరో టీమ్ బ్యాంక్ అధికారులుగా ఫోన్ చేసి అమాయక కస్టమర్లను బురిడీ కొట్టించి అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ఇక మరో తరహా నేరం లాటరీ, మ్యాట్రిమోనీ, జాబ్ ఆఫర్స్ ముసుగులో జరుగుతున్నాయి. కాబట్టి జరుగుతున్న మోసాలపై అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ సైబర్ కేటుగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఎంతో ఉంది.