Hyderabad: న్యూ ఇయర్ జోష్‌కు హైదరాబాద్ రెడీ
Hyderabad: రాత్రి 10 నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad: న్యూ ఇయర్ జోష్‌కు హైదరాబాద్ రెడీ
Hyderabad: నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమవుతున్నారు. ఈసారి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడే మొదలయ్యాయి. ఇదిలా ఉంటే భాగ్యనగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ అండ్ నెగ్లెజెంట్ డ్రైవింగ్, అతివేగం, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలను సీరియస్‌గా తీసుకుంటున్నామని, వీటిని అడ్డుకోవడం కోసం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలను ఇన్సిండెట్ ఫ్రీగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని, వాహనదారులు కూడా పోలీసులకు సహకరించి ప్రమాద రహితంగా వేడుకలను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇవాళ రాత్రి హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. NTR మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్‌పై రాత్రి 10 గంటల నుంచి రేపు తెల్లవారుజాము 2 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. బేగంపేట్, లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ మినహా నగరంలోని మిగతా ఫ్లై ఓవర్లన్నీ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మూసివేస్తున్నట్లు సీపీ తెలిపారు. ఖైరతాబాద్ వీవీ విగ్రహం వద్ద నుంచి నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వైపునకు వాహనాలకు అనుమతి లేదు. వాహనాలను రాజ్‌భవన్ రోడ్డులోకి మళ్లిస్తారు.
BRK భవన్ నుంచి NTR మార్గ్ వైపు వెళ్లే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్, లక్డీకాపూల్ వైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌కు వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి తెలుగుతల్లి చౌరస్తా, ఇక్బాల్ మినార్ వైపు నుంచి రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలు ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్, లక్డీకాపూల్ వైపు వెళ్లాలి. మింట్ కంపౌండ్ నుంచి సచివాలయం వెళ్లే లైన్‌లోకి సాధారణ వాహనదారులకు అనుమతి ఉండదు. ఈ రోడ్డు మూసేస్తారు.
మరోవైపు హైదరాబాద్ మెట్రో రైళ్ళ సమయం పొడిగించారు అధికారులు. ఇవాళ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. మొదటి స్టేషన్ లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. చివరి స్టేషన్ చేరే వరకు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడువనున్నాయి. నూతన సంవత్సర సందర్బంగా మద్యం సేవించి వాహనాలు నడపకుండా, మెట్రో రైల్ సేవల సమయం పొడగించినట్టు అధికారులు వెల్లడించారు. తాగి మెట్రోలో తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని మెట్రో అధికారుల హెచ్చరించారు.