GHMC Elections: గ్రేటర్‌ను మూడు ముక్కలు చేసే యోచన.. జూన్ తర్వాతే పోలింగ్?
GHMC Elections: గ్రేటర్‌ను మూడు ముక్కలు చేసే యోచన.. జూన్ తర్వాతే పోలింగ్?
HYD: హైదరాబాద్ నగర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ను మూడు భాగాలుగా విభజించాలనే ఆలోచనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విభజన అనంతరం కొత్తగా ఏర్పడే కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్‌ను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయి. అధికారికంగా ఈ మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
వేసవి కాలం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, ఎండాకాలం పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన జూన్ నెల తర్వాతే గ్రేటర్ పరిధిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ నగరంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, ఓటర్ల జాబితా సవరణ, సిబ్బంది నియామకాలు వంటి అంశాలకు సమయం కావడంతో ఆలస్యం తప్పదని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఉన్న GHMC కౌన్సిల్ గడువు వచ్చే నెల 10వ తేదీతో ముగియనుంది. గడువు ముగిసిన తర్వాత పరిపాలనా పరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నగర విభజన, ఎన్నికల సమయంపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి.