BJP: తెలంగాణలో బీజేపీ నేతల అరెస్టుల పర్వం కామారెడ్డి సెగలతో వేడెక్కిన రాజకీయం!

BJP: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెగలు పుడుతున్నాయి. బాన్సువాడ, కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ - బీజేపీ మధ్య చెలరేగిన వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది.

Update: 2026-02-22 06:12 GMT

BJP: తెలంగాణలో బీజేపీ నేతల అరెస్టుల పర్వం కామారెడ్డి సెగలతో వేడెక్కిన రాజకీయం!

BJP: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెగలు పుడుతున్నాయి. బాన్సువాడ, కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ - బీజేపీ మధ్య చెలరేగిన వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. బీజేపీ ముఖ్య నేతల హౌస్ అరెస్టులతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు 'ఛలో కామారెడ్డి' చుట్టూ తిరుగుతున్నాయి. బీజేపీ పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్రవ్యాప్తంగా కమలదళం ముఖ్య నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడంతో ఉద్రిక్తత పరాకాష్టకు చేరింది.

కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి యత్నించడం, అలాగే బాన్సువాడలో దుర్గామాత పాట విషయంలో తలెత్తిన ఘర్షణలు ఈ ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారాయి. ఈ ఘటనలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు 'ఛలో కామారెడ్డి', 'ఛలో బాన్సువాడ'కు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.

బీజేపీ నేతలు కామారెడ్డికి కదలకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ వంటి కీలక నేతలను వారి నివాసాల్లోనే పోలీసులు అడ్డుకున్నారు.ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్కా కొమురయ్యతో పాటు పలువురు ముఖ్య నాయకులను గృహనిర్బంధం చేశారు.

పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. "ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా?" అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే పోలీసులను అడ్డం పెట్టుకుని తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేసిన వారిని వదిలేసి, నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేయడం ఏంటని వారు నిలదీస్తున్నారు.

మరోవైపు కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద కఠిన తనిఖీలు నిర్వహిస్తున్నారు. బయటి వ్యక్తులు ఎవరూ పట్టణంలోకి రాకుండా పహారా కాస్తున్నారు. అయినప్పటికీ, బీజేపీ కార్యకర్తలు రహస్యంగా తరలివచ్చే అవకాశం ఉండడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి.ఈ అరెస్టుల పర్వం తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోరును మరింత ముదిరేలా చేసింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని బీజేపీ యోచిస్తోంది. ఈ ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



Full View


Tags:    

Similar News