Munugode Bypoll: మునుగోడులో నాటుకోడికి భలే క్రేజ్

Munugode Bypoll: ఎన్నికలంటే మాటలు కాదు.. మూటలు. అంతేనా..?

Update: 2022-10-22 13:18 GMT

Munugode Bypoll: మునుగోడులో నాటుకోడికి భలే క్రేజ్

Munugode Bypoll: ఎన్నికలంటే మాటలు కాదు.. మూటలు. అంతేనా..? నోట్లు ఇస్తే ఓట్లు రాలుతాయా..? కాదు.. వాటికి తోడు ముక్క, చుక్క కూడా కంపల్సరీ. అందుకే డబ్బులతో పాటు దావత్‌లపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. ఓటర్లతో పాటు ప్రచారానికి వస్తున్న నాయకులకు కూడా మటన్, చికెన్‌లతో విందు వినోదాల్లో ముంచెత్తుతున్నారు. దీంతో మునుగోడు నియోజకవర్గంలో నాటు కోళ్లకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. రేటు కూడా డబుల్ అయ్యింది. అయినా దొరకడం లేదు. ఎక్కడ చూసినా నాటు కోడి నో స్టాక్ అనే బోర్డులే దర్శనమిస్తున్నాయి.

ఎన్నికలంటేనే పండగ. అందునా ఉపఎన్నిక అంటే ఎప్పుడో సారి వచ్చే పెద్ద పండగన్నమాట. అందుకే ఈ పండగ దావత్‌ను పార్టీలన్నీ గట్టిగానే ఇస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో రానున్న మునుగోడు ఉపఎన్నిక కోసం అన్ని పార్టీల నాయకులు నిత్యం దావత్‌లల్లో మునిగితేలుతున్నారు. ఓటర్లకే కాదు ప్రచారానికి వచ్చిన పార్టీల నాయకులను కూడా మర్యాద పేరుతో లంచ్, డిన్నర్‌లో నాన్ వెజ్‌ మసాలాను ధట్టిస్తున్నారు. నాటు కోడి పులుసుతో రుచులు పంచుతున్నారు.

ఊర్లల్లో దావత్ అంటే చాలు.. నాటు కోడి పులుసు ఘుమఘుమలు పంచాల్సిందే. బాయిలర్ కోడి కూర కంటే.. నాటు కోడి రుచే నాలికకు నచ్చుతుంది. అందుకే నాటు కోడికి భలే డిమాండ్. అందునా ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పుడు ఇంటింటా నాటుకోడి వాసనలే. ఓటర్లకు నిత్యం మందు సీసాలతో పాటు నాన్‌వెజ్ ఇస్తున్నారు. మటన్‌తో పాటు చికెన్‌ అందులో నాటుకోడి మాంసాన్ని పంచుతున్నారు. అలాగే ప్రధాన పార్టీ పెద్దలు ప్రచారానికి వస్తుండటంతో వారికి మంచి విందును ఇచ్చేందుకు నాటుకోడి పులుసునే ఎంచుకుంటున్నారు. నాయకులు వస్తున్న సమాచారాన్ని ముందే శ్రేణులకు చెప్పి నాటుకోడి బిర్యానీలను తయారు చేయిస్తున్నారు. ఖర్చు గురించి వెనుకాడకుండా విందులను ఏర్పాటు చేస్తున్నారు. నాటు కోడి బిర్యానీలకే ఎక్కువమంది ఓటేస్తున్నారు. దీంతో మునుగోడు నియోజకవర్గంలో నాటుకోడికి ఎనలేని క్రేజ్ వచ్చి పండింది.

ఇలా కొనుగోళ్లు పెరగడంతో ఉప ఎన్నిక జరుగుతున్న గ్రామాలు, పట్టణాల్లో నాటు కోళ్లే కరువయ్యాయి. సమీపంలోని గ్రామాల నుంచి ఎక్కువ ధరకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు గ్రామాల్లో కూడా కోళ్ల అరుపులు మాయం అయ్యాయి. ఇళ్లల్లో పెంచుకునేవారి దగ్గర నుంచి కూడా కొనడంతో కంటికి కోళ్లే కనిపించడం లేదు. అలా నాటుకోడికి ఎనలేని క్రేజ్ వచ్చింది. ఒకప్పుడు నాటు కోడి మాంసం కిలో ధర 4 వందల లోపు ఉంటే అదిప్పుడు 7 వందలకు పైగా పలుకుతోంది. అయితే ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్న కోళ్లకు ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏకంగా కిలో నాటు కోడి మాంసం దూరాన్ని బట్టి 2 వేల వరకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా డిమాండ్‌ భారీగా పెరగడం నాటు కోళ్లు దొరక్కపోవడంతో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వేలకు వేలు పెట్టి తెస్తున్నా కూడా సరిపోకపోవడంతో కొన్నిచోట్ల బాయిలర్ కోళ్లతోనే లాగించేస్తున్నారు. 

Tags:    

Similar News