Bullet Train : చెన్నై 3 గంటలు..బెంగళూరు 2 గంటలు..భాగ్యనగరం నుంచి బుల్లెట్ రైలు జర్నీకి రంగం సిద్ధం
చెన్నై 3 గంటలు..బెంగళూరు 2 గంటలు..భాగ్యనగరం నుంచి బుల్లెట్ రైలు జర్నీకి రంగం సిద్ధం
Bullet Train : భారత రైల్వే ముఖచిత్రం పూర్తిగా మారిపోబోతోంది. పట్టాలపై చిరుతపులి వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్ల యుగం మన భాగ్యనగరానికి కూడా వచ్చేసింది. ఇప్పటివరకు కేవలం ముంబై-అహ్మదాబాద్ మధ్యే అనుకున్న ఈ మెగా ప్రాజెక్టులు, ఇప్పుడు హైదరాబాద్‌ను దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లలో మూడు మన హైదరాబాద్‌కే దక్కడం విశేషం. దీనివల్ల ప్రయాణ సమయం ఊహించని విధంగా తగ్గిపోనుంది.
దేశ రైల్వే చరిత్రలోనే ఒక విప్లవాత్మక మార్పు మొదలైంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు పనులు తుది దశకు చేరుకున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం మరో ఏడు హైస్పీడ్ కారిడార్లను పట్టాలెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో అత్యంత విశేషం ఏమిటంటే.. మూడు ప్రధాన కారిడార్లు మన హైదరాబాద్‌తో అనుసంధానమవుతున్నాయి. హైదరాబాద్-పుణె, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు మధ్య ఎలివేటెడ్ (స్తంభాల పై నిర్మించే) పద్ధతిలో ఈ ట్రాకులు నిర్మించనున్నారు. ఒక్కో ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.1.5 లక్షల కోట్లు. ఇవన్నీ పూర్తయితే ప్రయాణ కాలం మూడో వంతుకు తగ్గిపోతుంది.
ముంబైకి వెళ్లే ప్రయాణికులకు ఇది అద్భుతమైన వార్త. గతంలో హైదరాబాద్-ముంబై కారిడార్‌గా ఉన్న ప్రాజెక్టును ఇప్పుడు హైదరాబాద్-పుణె, పుణె-ముంబైగా రెండు భాగాలు చేశారు. మొత్తం 760 కిలోమీటర్ల పొడవుండే ఈ మార్గంలో ట్రైన్ గంటకు 350 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ముంబై చేరడానికి 14 గంటలు పడుతుండగా, బుల్లెట్ రైలులో కేవలం 3 గంటల్లో వెళ్లవచ్చు. ఈ మార్గంలో హైదరాబాద్, జహీరాబాద్, కలబురిగి, సోలాపూర్, పుణె వంటి 11 ప్రధాన స్టేషన్లు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించిన మట్టి పరీక్షలు, లైడార్ సర్వేలు ఇప్పటికే పూర్తయ్యాయి.
దక్షిణ భారతాన్ని కలిపే కారిడార్ల విషయానికి వస్తే.. హైదరాబాద్-చెన్నై మధ్య 710 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3 గంటల్లో దాటేయవచ్చు. తమిళనాడు ప్రభుత్వం కోరిక మేరకు ఈ మార్గంలో తిరుపతిని కూడా కలిపారు. ఇక బెంగళూరు ప్రయాణం కూడా అత్యంత వేగంగా మారనుంది. 626 కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రయాణం ప్రస్తుతం 9 గంటల సమయం తీసుకుంటుండగా, హైస్పీడ్ రైలు వస్తే 2 గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు. సెప్టెంబర్ 2025 నుంచే దీనికి సంబంధించిన సర్వే పనులు ఊపందుకున్నాయి. ఈ భారీ ప్రాజెక్టుల వల్ల కేవలం రవాణా మాత్రమే కాదు, ఐటీ, వ్యాపార రంగాలు కూడా భారీగా వృద్ధి చెందే అవకాశం ఉంది.