Karimnagar: సాంకేతికతను వాడటమే కాదు.. సృష్టించాలి!
Karimnagar: శాతవాహన విశ్వవిద్యాలయంలో 2047 వికసిత భారత్ లక్ష్యంగా వాణిజ్య, నిర్వహణ రంగాల్లో డిజిటల్ మార్పులపై రెండు రోజుల జాతీయ సదస్సు.
Karimnagar: సాంకేతికతను వాడటమే కాదు.. సృష్టించాలి!
Karimnagar: శాతవాహన విశ్వవిద్యాలయంలో రెండు రోజుల సదస్సు "ట్రాన్స్ఫార్మేటివ్ రోల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ది జర్నీ ఆఫ్ 2047" అని అంశం మీద విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ పరివర్తన వల్ల దేశము డిజిటల్ ఇండియా గా మారుతుందని, దీనివలన వాణిజ్య వ్యాపార రంగాలలో గొప్ప మార్పు ప్రారంభమవుతుందన్నారు. ఆర్థిక రంగంలో డిజిటల్ చెల్లింపుల వలన బ్యాంకింగ్ సేవలలో ఆధునిక మార్పులు వచ్చాయని, విద్యారంగంలో ఆన్లైన్ విద్యలో మార్పులు వచ్చాయని 2047 వరకు ఈ మార్పులు ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందాలని అన్నారు.
డిజిటలైజేషన్లో యువత పాత్ర కీలకం..
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శాతవాహన ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ ఈ డిజిటల్ పరివర్తన వలన గత పది ఏళ్లలో మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ఇండియా అనే నినాదంతో సాంకేతిక విషయాలన్నింటినీ కూడా సామాన్యుడికి అనుసంధానం చేస్తూ వికసిత భారత్ నిర్మాణానికి పునాదులు వేస్తున్నామన్నారు. మానవ జీవితంలో డిజిటల్ సాంకేతికత ఒక అవయవంగా మారిపోయిందని, దానితో భారత ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావచ్చని ఈ రెండు రోజుల సదస్సు తన లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.
డిజిటల్ సాంకేతికను సృష్టించే స్థాయికి చేరుకోవాలి..
కీలక ఉపన్యాసకులుగా విచ్చేసిన ఆచార్య జాస్తి రవికుమార్ (ఆల్ ఇండియా కామర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ) మాట్లాడుతూ ఈ డిజిటలైజేషన్ వలన వాణిజ్య, ఉత్పత్తి రంగాలలో ఆధునాతనమైన సేవలు ఉత్పత్తులను అందించడం జరుగుతుందని తెలిపారు. 2020 నుండి 2030 వరకు అభివృద్ధికరమైన వసతులు వస్తున్నాయని 2040 వరకు అత్యంత వేగాన్ని అందుకొని 2047వరకు డిజిటల్ చెల్లింపులలో డేటా ఆధారిత నిర్వహణలో నైపుణ్యాలలో మార్పులు వస్తాయని అన్నారు. ప్రతి పౌరుడు డిజిటల్ అక్షరాస్యతను ఉపయోగిస్తారని తద్వారా డిజిటల్ సాంకేతికతను ఉపయోగించడం మాత్రమే కాకుండా దాన్ని సృష్టించే స్థాయికి చేరుకోవడమే మన లక్ష్యంగా ఉండాలని తెలియజేశారు.
సెమినార్ల వల్ల వివిధ అంశాలు తెలుస్తాయి..
సదస్సు డైరెక్టర్, కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ డా. హరికాంత్, మాట్లాడుతూ ఈ రెండు రోజుల సెమినార్ లో మొత్తం 130 వివిధ రాష్ట్రాల నుండి తమ పరిశోధన పత్రాలను సమర్పించడం జరిగిందని ఈ పరిశోధన పత్రాలని ఐఎస్ఎస్ఎన్ జర్నల్ మూడు భాగాలుగా విడుదల చేయడం జరిగిందని అన్నారు ఇలాంటి సెమినార్ల వలన వివిధ ప్రాంతాల్లో వివిధ అంశాల మీద పరిశోధన జరిగి ఆ విషయాలను సమాజానికి తెలియజేయడం ద్వారా పరిశ్రమలకు విశ్వవిద్యాలయాలకు మధ్యన ఒక బంధం ఏర్పడుతుందని ఈ సదస్సు వల్ల దేశం సాంకేతిక విప్లవం వైపు నడుస్తుందని తద్వారా అద్వితీయమైన మార్పులతో అభివృద్ధివైపు పరిగెడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమానికి సెమినార్ కో కన్వీనర్స్ డాక్టర్ కె తిరుపతి, డాక్టర్ బి నరేష్, డాక్టర్ బి. పరుశురాములు వివిధ కళాశాలల ఆచార్యులు, పత్ర సమర్పకులు,మేనేజ్మెంట్ అధ్యాపకులు డా.ఈ.మనోహర్ ,డా. ఎన్ వి శ్రీరంగ ప్రసాద్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమాకాంత్ పరీక్షల నియంత్రణ అధికారి సురేష్ కుమార్, అధ్యాపకులు డాక్టర్ ఎం మనోజ్ కుమార్ , సావిత్రి అధ్యాపకులు అధ్యాపకేతర బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.